శరీరంలో కీలకమైన అవయవాలలో ఒకటైన కాలేయం యొక్క ప్రాముఖ్యతను, దాని ఆరోగ్యాన్ని కాపాడుకోవాల్సిన ఆవశ్యకతను ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా రంగారెడ్డి జిల్లా వైద్యాధికారిని డాక్టర్ కే లలితాదేవి నొక్కి చెప్పారు. ఆధునిక జీవనశైలి కారణంగా పెరుగుతున్న కాలేయ వ్యాధులపై ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
రంగారెడ్డి జిల్లా వైద్యాధికారిని డాక్టర్ కే లలితాదేవి, బూర్గుల ఆరోగ్య కేంద్రంలో ప్రపంచ కాలేయ దినోత్సవం సందర్భంగా మాట్లాడుతూ, కాలేయం శరీరంలోని అనేక ముఖ్యమైన జీవక్రియలకు కేంద్ర బిందువని, మనం తీసుకునే ఆహారం, నీరు, ఔషధాలు వంటి అన్నింటినీ శుద్ధి చేయడంలో ఇది కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. సుమారు 500కు పైగా విధులను కాలేయం నిర్వహిస్తుందని ఆమె వివరించారు.
కాలేయానికి పునరుత్పత్తి సామర్థ్యం ఉన్నప్పటికీ, నిర్లక్ష్యం వలన తీవ్ర నష్టం వాటిల్లుతుందని, ప్రారంభ దశలో లక్షణాలు బయటపడకపోవడం వల్ల దీనిని 'నిశ్శబ్ద హంతకుడు'గా పేర్కొన్నారని డాక్టర్ లలితాదేవి తెలిపారు. ప్రస్తుతం, మద్యపానం మాత్రమే కాకుండా, అధిక కొవ్వు గల ఆహారం, జంక్ ఫుడ్, వ్యాయామం లేకపోవడం వంటి ఆధునిక జీవనశైలి కారణంగా 'నాన్ ఆల్కహాలిక్ ఫ్యాటీ లివర్' కేసులు కూడా గణనీయంగా పెరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు.
ఆరోగ్యకరమైన కాలేయం కోసం ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను డాక్టర్ లలితాదేవి వివరించారు. ప్రతిరోజూ కనీసం 30 నుంచి 45 నిమిషాల పాటు వ్యాయామం చేయడం, సమతుల్య ఆహారం తీసుకోవడం, జంక్ ఫుడ్, అధిక కొవ్వు పదార్థాలు, చక్కెర పానీయాలను తగ్గించడం, మద్యపానానికి పూర్తిగా దూరంగా ఉండటం, తగినంత నీరు తాగడం వంటివి పాటించాలని సూచించారు. అలాగే, ఏడాదికి ఒకసారి కాలేయ పనితీరు పరీక్షలు చేయించుకోవాలని, హెపటైటిస్ బి వంటి వ్యాధులపై అవగాహన పెంచుకోవాలని తెలిపారు.
“మంచి అలవాట్లు - పటిష్టమైన కాలేయం” అనే నినాదంతో ప్రతి ఒక్కరూ ఆరోగ్యకరమైన జీవనశైలిని అనుసరించాలని డాక్టర్ కే లలితాదేవి పిలుపునిచ్చారు. ఆరోగ్యవంతమైన దేశ నిర్మాణంలో పౌరుల ఆరోగ్యమే కీలకమని, కాలేయ రక్షణ జీవన రక్ష అని గుర్తించాలని ఆమె అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మాస్ మీడియా ఆఫీసర్ కె. శ్రీనివాసులు, బూర్గుల వైద్యాధికారి డాక్టర్ రఘురాం, డాక్టర్ జయప్రకాష్, ల్యాబ్ టెక్నీషియన్ వెంకటరమణి, స్టాఫ్ నర్స్ సునీత, ఫార్మసిస్ట్ రాజశ్రీ, హెల్త్ అసిస్టెంట్ రెడ్డి నాయక్, ఏఎన్ఎం సిబ్బంది పాల్గొన్నారు.







