కామారెడ్డి, జూలై 12
పిల్లలను నులిపురుగుల బారినుంచి రక్షించి, వారి ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు బాటలు వేయాలనే లక్ష్యంతో జూలై 13న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఈ కార్యక్రమంలో భాగంగా 1 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల 2,46,177 మంది బాలబాలికలకు ఉచితంగా ఆల్బెండాజోల్ మాత్రలు అందజేయనున్నారు.
పిల్లలను నులిపురుగుల బారినుంచి రక్షించి, వారి ఆరోగ్యవంతమైన ఎదుగుదలకు బాటలు వేయాలనే లక్ష్యంతో జూలై 13న జాతీయ నులిపురుగుల నిర్మూలన దినోత్సవాన్ని (National Deworming Day–2026) జిల్లావ్యాప్తంగా నిర్వహించనున్నట్లు వైద్య ఆరోగ్యశాఖ తెలిపింది. ఆ రోజు మాత్రలు తీసుకోలేని అర్హులైన బాలబాలికలకు జూలై 20న మాప్-అప్ రౌండ్ నిర్వహించి ఆల్బెండాజోల్ మాత్రలను పంపిణీ చేయనున్నారు.
జిల్లాలో మొత్తం 2,46,177 మంది 1 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు గల బాలబాలికలకు ఉచితంగా ఆల్బెండాజోల్ మాత్రలు అందజేయనున్నారు. అంగన్వాడీ కేంద్రాలు, ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, గురుకులాలు, కస్తూర్బా, ఆశ్రమ పాఠశాలలు, జూనియర్ కళాశాలలతో పాటు పాఠశాలకు వెళ్లని పిల్లలను కూడా ఈ కార్యక్రమంలో భాగం చేయనున్నారు.
నులిపురుగులు పిల్లల పేగుల్లో నివసిస్తూ శరీరానికి అవసరమైన పోషకాలను గ్రహించడం వల్ల రక్తహీనత, పోషకాహార లోపం, ఎదుగుదల మందగించడం, బలహీనత, జ్ఞాపకశక్తి తగ్గడం, చదువుపై ఏకాగ్రత లోపించడం వంటి సమస్యలు తలెత్తుతాయని వైద్య నిపుణులు తెలిపారు. పరిశుభ్రత లోపం, కలుషిత నీరు, బహిరంగ మలవిసర్జన, చేతులు శుభ్రంగా కడుక్కోకపోవడం వంటి కారణాలతో ఈ వ్యాధి వ్యాపిస్తుందని వివరించారు.
ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) సిఫారసు చేసిన సురక్షితమైన ఔషధమైన ఆల్బెండాజోల్ మాత్ర తీసుకోవడం ద్వారా పేగులలోని నులిపురుగులు నశించి, పోషకాల శోషణ మెరుగుపడి పిల్లల శారీరక, మానసిక వికాసానికి తోడ్పడుతుందని పేర్కొన్నారు.
వయస్సు ఆధారంగా 1–2 సంవత్సరాల పిల్లలకు సగం మాత్రను పొడి చేసి, 2–19 సంవత్సరాల వారికి 400 మిల్లీగ్రాముల పూర్తి మాత్రను నమిలి మింగేలా అందజేయనున్నారు. ఆశా కార్యకర్తలు, ఏఎన్ఎంలు, అంగన్వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో మాత్రలు పంపిణీ చేయనున్నారు.
ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైద్య ఆరోగ్యశాఖతో పాటు విద్యాశాఖ, మహిళా-శిశు సంక్షేమ శాఖ, పంచాయతీరాజ్ శాఖ, అంగన్వాడీ, ఆశా కార్యకర్తలు, గ్రామపంచాయతీలు, ప్రజాప్రతినిధులు, తల్లిదండ్రులు సమన్వయంతో పనిచేయనున్నట్లు అధికారులు తెలిపారు.
తల్లిదండ్రులు తమ పిల్లలు జూలై 13న తప్పనిసరిగా ఆల్బెండాజోల్ మాత్ర తీసుకునేలా చూడాలని, ఆ రోజు అవకాశం లేకపోతే జూలై 20న నిర్వహించే మాప్-అప్ రౌండ్లో మాత్ర అందేలా సహకరించాలని వైద్యశాఖ విజ్ఞప్తి చేసింది. అలాగే పరిశుభ్రత పాటించడం, సబ్బుతో చేతులు కడుక్కోవడం, చెప్పులు ధరించడం, మరుగుదొడ్ల వినియోగం వంటి అలవాట్లు కూడా నులిపురుగుల నివారణలో కీలకమని సూచించింది.












