సంగారెడ్డి, జూలై 9
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన, ఆధునిక వైద్య సేవలను ఉచితంగా అందించడంతో పాటు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు సత్వర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ఈఎస్ఐ వైద్య సేవలను విస్తరిస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈఎస్ఐ డిస్పెన్సరీని వారు ప్రారంభించారు.
రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు నాణ్యమైన, ఆధునిక వైద్య సేవలను ఉచితంగా అందించడంతో పాటు, పరిశ్రమల్లో పనిచేసే కార్మికులకు సత్వర వైద్య సేవలు అందుబాటులో ఉండేలా ఈఎస్ఐ వైద్య సేవలను విస్తరిస్తోందని రాష్ట్ర కార్మిక, ఉపాధి శాఖ మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. గురువారం సంగారెడ్డి జిల్లా కేంద్రంలో నూతనంగా ఏర్పాటు చేసిన ఈఎస్ఐ డిస్పెన్సరీని జహీరాబాద్ పార్లమెంట్ సభ్యులు సురేష్ షెట్కర్, టిపీసీసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి లతో కలిసి మంత్రులు ప్రారంభించారు.
ఈ సందర్భంగా మంత్రులు మాట్లాడుతూ, ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించడం ప్రభుత్వ బాధ్యత అని అన్నారు. ప్రభుత్వ ఆసుపత్రులపై ప్రజల్లో విశ్వాసం పెరిగేలా అన్ని మౌలిక వసతులు, వైద్య సదుపాయాలను కల్పిస్తూ ఈఎస్ఐ వ్యవస్థను మరింత బలోపేతం చేస్తున్నట్లు తెలిపారు. సంగారెడ్డి పారిశ్రామిక ప్రాంతంలో పనిచేసే కార్మికులు వైద్య చికిత్స కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన అవసరం లేకుండా స్థానికంగానే అన్ని రకాల వైద్య సేవలు అందించాలనే ఉద్దేశంతో సంగారెడ్డిలో ఈఎస్ఐ డిస్పెన్సరీని ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.
సంగారెడ్డి జిల్లా పారిశ్రామికంగా వేగంగా అభివృద్ధి చెందుతున్న నేపథ్యంలో కార్మికుల ఆరోగ్య పరిరక్షణకు ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యత ఇస్తోందన్నారు. రూ.200 కోట్లతో సంగారెడ్డి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. జహీరాబాద్, నారాయణఖేడ్, సదాశివపేట, ఆందోల్, జోగిపేట ప్రాంతాల ప్రజలకు కార్డియాలజీ, నెఫ్రాలజీ, న్యూరాలజీ, ఈఎన్టీ, క్యాన్సర్ చికిత్స, ట్రామా కేర్, నేత్ర వైద్య సేవలు వంటి సూపర్ స్పెషాలిటీ సేవలను అందుబాటులోకి తీసుకొచ్చామని చెప్పారు. జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని సూపర్ స్పెషాలిటీ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పీజీ సీట్లను కూడా కేటాయించినట్లు వెల్లడించారు.
టీపిసిసి వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి మాట్లాడుతూ, ఈఎస్ఐ ఆసుపత్రి ఏర్పాటు చేయాలని నిర్మలా జగ్గారెడ్డి అడిగిన వెంటనే మంజూరు చేసిన మంత్రి వివేక్ వెంకటస్వామి కి, సహకరించిన మంత్రి దామోదర రాజనర్సింహ కు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ డిస్పెన్సరి అందుబాటులోకి రావడం తో సంగారెడ్డి ప్రాంత కార్మికులకు లాభం జరుగుతుందని సంతోషం వ్యక్తం చేశారు.











