మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో అర్హతలేని వ్యక్తులతో నడుస్తున్న రెండు వైద్య క్లినిక్‌లపై అధికారులు కఠిన చర్యలు తీసుకున్నారు. నిబంధనలను ఉల్లంఘిస్తున్నట్లు గుర్తించిన సఫిల్‌గూడలోని ‘శ్రీ వెంకటేశ్వర వెల్నెస్ సెంటర్’ మరియు ఏఎస్ రావు నగర్‌లోని ‘ట్రైకోవియా హెయిర్ అండ్ స్కిన్ క్లినిక్’లను అధికారులు సీజ్ చేశారు.
జిల్లా యంత్రాంగం చేపట్టిన తనిఖీల్లో భాగంగా, సఫిల్‌గూడలో ‘శ్రీ వెంకటేశ్వర వెల్నెస్ సెంటర్’ను అధికారులు సీజ్ చేశారు. ఈ క్లినిక్ గతంలో కూడా రిజిస్ట్రేషన్ లేకుండా నడుస్తూ, నకిలీ పత్రాలు సమర్పించినందుకు సీజ్ చేయబడినట్లు అధికారులు తెలిపారు. కొత్త పేరుతో మళ్లీ రిజిస్ట్రేషన్ పొంది, అర్హతలేని మేనేజింగ్ డైరెక్టర్ ఎస్. సుజిత బోటాక్స్, లేజర్ హెయిర్ రిమూవల్ వంటి చికిత్సలు నిర్వహిస్తున్నట్లు గుర్తించారు. ఒక్కో సిట్టింగ్‌కు రూ.18,000 వరకు వసూలు చేస్తూ, ప్రజలను ఆర్థికంగా దోపిడీ చేస్తున్నారని బాధితుల ఫిర్యాదుల మేరకు ఈ చర్యలు తీసుకున్నారు.
అదేవిధంగా, ఏఎస్ రావు నగర్‌లోని ‘ట్రైకోవియా హెయిర్, స్కిన్ అండ్ లేజర్ క్లినిక్’లోనూ నిబంధనల ఉల్లంఘన వెలుగులోకి వచ్చింది. డా. నాజియా పేరుతో రిజిస్ట్రేషన్ ఉన్న ఈ కేంద్రంలో, బి.డి.ఎస్ డెంటిస్ట్ డా. ప్రణవి చర్మ, ముఖ సంబంధిత చికిత్సలు అందిస్తున్నట్లు అధికారులు గుర్తించి, క్లినిక్‌ను మూసివేశారు. ఈ చర్యలు నేషనల్ మెడికల్ కమిషన్ చట్టంలోని పలు నిబంధనలను ఉల్లంఘించినట్లు అధికారులు తెలిపారు.
జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డా. సి. ఉమా గౌరి మాట్లాడుతూ, అర్హత కలిగిన వైద్యులు మాత్రమే సేవలు అందించాలని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడే వారిపై ఉపేక్ష ఉండదని హెచ్చరించారు. జిల్లాలో తనిఖీలు మరింత ముమ్మరం చేస్తామని తెలిపారు. ప్రజలు ఇటువంటి నకిలీ కేంద్రాల పట్ల అప్రమత్తంగా ఉండాలని, చికిత్స పొందే ముందు వైద్యుల అర్హతలను తప్పనిసరిగా పరిశీలించుకోవాలని అధికారులు సూచించారు.











