సంగారెడ్డి జిల్లా రైతు బజార్ సమీపంలోని మైనార్టీ రెసిడెన్షియల్ పాఠశాలలో నిర్వహిస్తున్న వైద్య శిబిరాన్ని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య గురువారం సందర్శించి, అధికారులకు పలు సూచనలు చేశారు.
వంద రోజుల ప్రత్యేక కార్యాచరణలో భాగంగా ఆర్బీఎస్కే ఆధ్వర్యంలో ఈ వైద్య శిబిరం ఏర్పాటు చేయబడింది. కలెక్టర్ ప్రావీణ్య విద్యార్థుల ఆరోగ్య పరీక్షల వివరాలను వైద్యులను అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు సాధారణ ఆరోగ్య పరీక్షలతో పాటు రక్తహీనత, కంటి, చెవి, దంత సమస్యలు, పోషకాహార లోపాలను గుర్తించి, అవసరమైన వారికి మెరుగైన చికిత్స అందించాలని కలెక్టర్ సూచించారు.
శిబిరం ద్వారా విద్యార్థుల ఆరోగ్య పరిస్థితిని ముందుగానే గుర్తించి, సమయానుకూల వైద్యం అందించడం వల్ల ప్రయోజనం ఉంటుందని వైద్య బృందం కలెక్టర్కు వివరించింది.
విద్యార్థుల ఆరోగ్యం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించరాదని, ప్రతి ఒక్కరికీ నాణ్యమైన వైద్య సేవలు అందేలా వైద్యులు, సిబ్బంది బాధ్యతాయుతంగా వ్యవహరించాలని కలెక్టర్ ఆదేశించారు.











