నిజామాబాద్, 2026-07-12
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో సంచరిస్తున్న ఎస్-12, జే-1 అనే రెండు పెద్దపులుల ఆచూకీ ఏడాది కాలంగా లభించకపోవడం కలకలం రేపుతోంది. మహారాష్ట్ర, ఆదిలాబాద్ అభయారణ్యాల నుంచి వచ్చిన ఈ పులులు వేటగాళ్ల ఉచ్చులో చిక్కాయా లేక ఇతర ప్రాంతాలకు తరలిపోయాయా అనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది. ట్రాప్ కెమెరాల్లో కూడా వీటి జాడ కనిపించకపోవడంతో అనుమానాలు బలపడుతున్నాయి.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో ఏడాది కాలంగా సంచరించిన రెండు పెద్దపులుల ఆచూకీ లభించకపోవడం మరోసారి చర్చనీయాంశంగా మారింది. మహారాష్ట్రలోని తడోబా అభయారణ్యం, ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని కవ్వాల్ టైగర్ రిజర్వ్ నుంచి అటవీ మార్గంలో నిజామాబాద్ జిల్లాలోకి వచ్చిన ఎస్-12, జే-1 పులులు ఇటీవల కనిపించకపోవడంతో అవి వేటగాళ్ల ఉచ్చులో చిక్కాయా? లేక ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయాయా? అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.
అటవీశాఖ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాల్లో కూడా ఈ పులుల జాడ నమోదుకాకపోవడం అనుమానాలకు తావిస్తోంది. గతంలో మాచారెడ్డి మండలం స్టేషన్ తండా సమీపంలో ఎస్-12 పులిని విషప్రయోగంతో చంపేందుకు యత్నించిన ఘటన సంచలనం సృష్టించింది. ఆ కేసులో పలువురిని అరెస్టు చేసినప్పటి నుంచి ఆ పులి జాడ స్పష్టంగా లభించలేదు. ఈ ఏడాది జిల్లాలోకి వచ్చిన జే-1 పులిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు అధికారులు ప్రయత్నించినప్పటికీ దాని ఆచూకీ కూడా తెలియడం లేదు.
ఇదే సమయంలో జిల్లాలోని కమ్మర్పల్లి, ఇందల్వాయి అటవీ ప్రాంతాల్లో వన్యప్రాణుల వేటకు సంబంధించిన ఘటనలు వెలుగులోకి రావడం ఆందోళన కలిగిస్తోంది. భీంగల్ మండలం దేవక్కపేట అటవీ ప్రాంతంలో వన్యప్రాణుల వేటకు సంబంధించి పలువురిని నిఘా వర్గాలు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం.
ఇక ఆరు నెలల క్రితం ఇందల్వాయి రేంజ్ పరిధిలోని ధర్పల్లి అటవీ ప్రాంతంలో చిరుతను వేటాడిన కేసు కూడా తాజాగా ప్రాధాన్యం సంతరించుకుంది. ఆ కేసులో మొత్తం ఆరుగురిని విచారిస్తున్నట్లు తెలిసింది. చిరుతను కాల్చి చంపిన అనంతరం దాని చర్మాన్ని వేరు చేసి, గోళ్లను సేకరించినట్లు ప్రాథమిక సమాచారం వెలుగులోకి వచ్చింది. ఈ సమాచారం నేపథ్యంలో కారేపల్లి, దేవక్కపేట ప్రాంతాల్లో పులి కూడా వేటగాళ్లకు బలైందనే ప్రచారం సాగుతోంది.
అయితే అటవీశాఖ అధికారులు మాత్రం కమ్మర్పల్లి రేంజ్ పరిధిలో వన్యప్రాణి వేట జరిగిన మాట వాస్తవమేనని, అయితే అది పెద్దపులి కాదని, చిరుతేనని చెబుతున్నారు. అక్కడ లభించిన జంతు కళేబరానికి పోస్టుమార్టం నిర్వహించి, శాస్త్రీయ పరీక్షల కోసం ప్రయోగశాలకు పంపే ఏర్పాట్లు చేస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం.
దేవక్కపేట అటవీ ప్రాంతంలో జరిగిన వేటలో నాటు తుపాకిని ఉపయోగించినట్లు ప్రాథమికంగా తేలినట్లు సమాచారం. ఈ పరిణామం అటవీశాఖను అప్రమత్తం చేసింది. జిల్లాలో ఇప్పటికీ ఎయిర్గన్లు, నాటు తుపాకులతో వేట కొనసాగుతోందని స్థానికులు చెబుతున్నారు.












