ప్రపంచ అటవీ దినోత్సవాన్ని పురస్కరించుకుని కామారెడ్డి జిల్లాలో అటవీ శాఖ విస్తృత స్థాయిలో కార్యక్రమాలను నిర్వహించడానికి సన్నద్ధమైంది. “అటవీ సంరక్షణే దేశ సంరక్షణ” అనే ప్రధాన నినాదంతో ఈ వేడుకలు పర్యావరణ పరిరక్షణపై ప్రజల్లో చైతన్యం పెంపొందించే లక్ష్యంతో నిర్వహించనున్నాయి.
తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న “తెలంగాణ రైజింగ్ 2047” లక్ష్యాలతో పాటు “ప్రజా పాలన – ప్రగతి” కింద కొనసాగుతున్న 99 రోజుల కార్యాచరణ ప్రణాళికలో భాగంగా ఈ కార్యక్రమాలకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించారు. అటవీ సంపద సంరక్షణ, హరితవనం విస్తరణపై దృష్టి సారిస్తూ ప్రజల భాగస్వామ్యాన్ని పెంచే దిశగా చర్యలు చేపట్టారు.
మార్చి 23న ఉదయం 10 గంటలకు జిల్లా అటవీ కార్యాలయం నుండి మున్సిపల్ కార్యాలయం, బస్ స్టాండ్ మార్గంగా ప్రభుత్వ డిగ్రీ కళాశాల వరకు అవగాహన ర్యాలీ నిర్వహించబడుతుంది. అనంతరం ఉదయం 11 గంటలకు మొక్కలు నాటే కార్యక్రమం చేపట్టనున్నారు.
తదుపరి, ఉదయం 11.30 గంటలకు ప్రభుత్వ డిగ్రీ కళాశాల వేదికగా నిర్వహించే సమావేశంలో అతిథులు అటవీ సంరక్షణ, పర్యావరణ పరిరక్షణ ప్రాముఖ్యతపై ప్రసంగిస్తారు. ప్రకృతి సంపదను కాపాడుకోవడం ద్వారా భవిష్యత్ తరాలకు సురక్షిత వాతావరణాన్ని అందించవచ్చని అధికారులు పేర్కొన్నారు.
ఈ సందర్భంగా జిల్లా అటవీ అధికారి బొగా నిఖిత, ఐఎఫ్ఎస్ మాట్లాడుతూ, ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. అటవీ సంపద సంరక్షణ ప్రతి ఒక్కరి సామాజిక బాధ్యతగా భావించి ముందుకు రావాలని ఆమె సూచించారు. ప్రకృతిని కాపాడితేనే మనుగడ సాధ్యమని, అటవీ వనరుల పరిరక్షణ ద్వారానే పర్యావరణ సమతౌల్యం నిలబడుతుందని అధికారులు స్పష్టం చేశారు.












