పర్యావరణ పరిరక్షణలో భాగంగా చెరువులను కాపాడటం ద్వారానే నగరానికి భవిష్యత్తు ఉంటుందని, ఆక్రమణలు, కాలుష్యం నుంచి మూసీ నదిని పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని పీసీసీ సభ్యులు, టీపీసీసీ అధికార ప్రతినిధి డా. సత్యం శ్రీరంగం అన్నారు. నల్లచెరువు ప్రారంభోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఆయన కూకట్పల్లి నియోజకవర్గ సమస్యలపై వినతి పత్రం అందించారు.
కూకట్పల్లి నియోజకవర్గం విద్యార్థులు, ఉద్యోగుల అధిక జనాభాతో కూడిన కీలక ప్రాంతమని, ఇక్కడి మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీని మెరుగుపరచాలని డా. సత్యం శ్రీరంగం విజ్ఞప్తి చేశారు. విద్యార్థుల ప్రతిభను ప్రోత్సహించడానికి అధునాతన క్రీడా సముదాయం ఏర్పాటు చేయాలని ఆయన సూచించారు.
భారీ వర్షాలు, వరదల వల్ల కలిగే ఇబ్బందులను నివారించడానికి నాలా డ్రైనేజీ నెట్వర్క్ను బలోపేతం చేయాలని, శాశ్వత రిటైనింగ్ గోడలు, చెత్త నివారణ వ్యవస్థలు ఏర్పాటు చేయాలని కోరారు. ఇది పారిశుద్ధ్యాన్ని మెరుగుపరచడంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాలను రక్షిస్తుందని తెలిపారు.
కూకట్పల్లి, హైటెక్ సిటీ మధ్య ట్రాఫిక్ రద్దీని తగ్గించడానికి సిగ్నల్ రహిత కారిడార్ల అభివృద్ధి, రోడ్డు మౌలిక సదుపాయాల బలోపేతం, ప్రజా రవాణా వ్యవస్థల విస్తరణ అవసరమని పేర్కొన్నారు. దీనివల్ల ప్రయాణ సమయం గణనీయంగా తగ్గుతుందని, వేలాది మంది ఉద్యోగులకు ప్రయోజనం చేకూరుతుందని తెలిపారు.
పట్టణ గ్రీన్ పార్కులు, ఎకో పార్కులు, వాకింగ్ ట్రాక్లు, సరస్సుల చుట్టూ వినోద ప్రదేశాల అభివృద్ధి ద్వారా నివాసితుల జీవన నాణ్యతను మెరుగుపరచాలని సూచించారు. ఉడాసిన్ ముట్ట్కు చెందిన భూమిని పబ్లిక్ ఎకో పార్క్ అభివృద్ధికి పరిగణించాలని కోరారు. యువతకు ఉపాధి అవకాశాలు పెంచడానికి నైపుణ్యాభివృద్ధి కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని విజ్ఞప్తి చేశారు.

