రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గురువారం హైదరాబాద్ నుండి వర్చువల్గా జహీరాబాద్ పట్టణ శివారులో రూపుదిద్దుకున్న త్రివేణివనం- ఫారెస్ట్ ఎకో పార్కును ప్రారంభించారు. జాతీయ రహదారి పక్కన 208 ఎకరాల విస్తీర్ణంలో అభివృద్ధి చెందిన ఈ పార్కు, పర్యావరణ పరిరక్షణ మరియు పచ్చదనం పెంపుదల దిశగా ప్రభుత్వం చేపట్టిన చర్యలకు నిదర్శనం.
అటవీ శాఖ ఆధ్వర్యంలో నిర్మించిన ఈ పార్కు ప్రారంభోత్సవం సందర్భంగా, ఎంపీ సురేష్ షెట్కార్ మాట్లాడుతూ, రాష్ట్ర ప్రభుత్వం పచ్చదనం పెంపు, పర్యావరణ పరిరక్షణకు చిత్తశుద్ధితో కృషి చేస్తోందని, ఈ దిశగా వనమహోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. జహీరాబాద్ నిమ్జ్ ద్వారా పారిశ్రామిక స్మార్ట్ సిటీగా అభివృద్ధి చెందుతోందని, ఇది స్థానిక యువతకు ఉపాధి అవకాశాలను మెరుగుపరుస్తుందని ఆయన పేర్కొన్నారు.
టీజీఐఐసీ చైర్పర్సన్ నిర్మలా జయప్రకాశ్ రెడ్డి మాట్లాడుతూ, ప్రకృతిని పరిరక్షించడం ద్వారా భవిష్యత్ తరాలకు ఆరోగ్యకరమైన వాతావరణాన్ని అందించవచ్చని, ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాల్సిన బాధ్యతను గుర్తు చేశారు. మానవాళికి ప్రాణవాయువును అందించే చెట్లు, అడవులను కాపాడటం అందరి కర్తవ్యమని ఆమె నొక్కి చెప్పారు.
జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్ ఈ పార్కును ఎంతో ఆకర్షణీయంగా అభివృద్ధి చేశారని ప్రశంసించారు. పార్కులో సైక్లింగ్ వంటి ప్రత్యేక సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయని, ప్రజలు అధిక సంఖ్యలో సందర్శించి దీనిని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు. వనమహోత్సవంలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంపొందించాలని ఆయన పిలుపునిచ్చారు. జహీరాబాద్ శాసన సభ్యులు మాణిక్రావు కూడా ఈ పార్కును ప్రజలకు గొప్ప వరంగా అభివర్ణించారు.












