భవిష్యత్ తరాల అవసరాలను తీర్చడానికి, తీవ్రమైన నీటి ఎద్దడిని నివారించడానికి భూగర్భ జలాల సంరక్షణ ప్రతి పౌరుడి బాధ్యత అని మేడ్చల్–మల్కాజ్గిరి జిల్లా అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ అన్నారు. కేంద్రీయ భూగర్భ జల బోర్డు ఆధ్వర్యంలో నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
జిల్లా కలెక్టరేట్ సమావేశ మందిరంలో కేంద్రీయ భూగర్భ జల బోర్డు (CGWB), జలశక్తి మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల ఇంజనీర్లు, సాంకేతిక సహాయకులకు “భూగర్భ జలాల సంరక్షణ”పై ఒక రోజు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి అదనపు కలెక్టర్ ఫైజాన్ అహ్మద్ ముఖ్య అతిథిగా హాజరై, జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు.
భూగర్భ జలాల సంరక్షణ కోసం శాస్త్రీయ పరిశోధనలను క్షేత్రస్థాయిలో అమలు చేయాలని అదనపు కలెక్టర్ సూచించారు. నీటి నిల్వ నిర్మాణాల ఆవశ్యకతను నొక్కి చెబుతూ, భూగర్భ జలాల పెంపు కోసం ఇంకుడు గుంతలు, నీటి కుంటల వంటి నిర్మాణాలను విస్తృతంగా చేపట్టాలని సూచించారు.
ప్రజల్లో నీటి సంరక్షణపై అవగాహన కల్పించి, వారిని భాగస్వామ్యం చేయడం ద్వారా భవిష్యత్తులో నీటి ఎద్దడిని సమర్థవంతంగా ఎదుర్కోవచ్చని ఆయన పేర్కొన్నారు. శిక్షణలో భాగంగా, సీజీడబ్ల్యుబీ శాస్త్రవేత్త డాక్టర్ పండిట్ మధునూర్ సాంకేతిక పరిజ్ఞానంతో జల సమస్యల పరిష్కారాన్ని వివరించారు. డాక్టర్ సుధీర్ బాబు జల సంరక్షణ ప్రాముఖ్యతను ఉదాహరణలతో తెలిపారు. జిల్లా భూగర్భ జల అధికారి ఎం. హరీష్ బాబు జిల్లాలోని భూగర్భ జల స్థితిగతులపై ప్రజెంటేషన్ ఇచ్చారు.
ఈ సందర్భంగా కేంద్రీయ భూగర్భ జల మండలి ప్రచురించిన ‘అక్విఫర్ మేనేజ్మెంట్’, ‘భూగర్భ జల గణన’ నివేదికలను అతిథులు ఆవిష్కరించారు. డీఆర్డీఓ సాంబశివరావు, పలువురు శాస్త్రవేత్తలు, భూగర్భ జల శాఖ అధికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

