చెన్నై నగరంలోని పోరూరులో నివసిస్తున్న టీవీ నటి సుభాషిణి (36) ఆత్మహత్య చేసుకున్న ఘటన సినీ పరిశ్రమలో కలకలం సృష్టించింది. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.
పోరూరులోని తన నివాసంలో సుభాషిణి ఉరివేసుకుని మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు, మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. సుభాషిణి శ్రీలంకకు చెందినవారని, భర్త పిప్పిన్తో కలిసి గతంలో బెంగళూరులో నివసించేవారని తెలిసింది.
షూటింగ్ షెడ్యూల్స్ కారణంగా సుభాషిణి చెన్నైలోని పోరూరులో ఒంటరిగా ఉంటున్నారని, ఆమె టీవీ సీరియల్స్, సినిమాల్లో నటిస్తూ తన కెరీర్ను కొనసాగించారని సమాచారం. 'కయల్' అనే టీవీ సీరియల్ ద్వారా ఆమె ప్రేక్షకులకు సుపరిచితురాలైంది. సోషల్ మీడియాలో కూడా ఆమె చురుగ్గా ఉండేది, ముఖ్యంగా ఇన్స్టాగ్రామ్లో ఆమెకు మంచి ఫాలోయింగ్ ఉండేది.
ప్రాథమిక విచారణలో, ఆత్మహత్యకు ముందు రోజు రాత్రి సుభాషిణి తన భర్తతో వీడియో కాల్లో మాట్లాడుతున్నప్పుడు వాగ్వాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వాగ్వాదం కారణంగా ఆమె తీవ్ర మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని అనుమానిస్తున్నారు. కుటుంబ సమస్యలు కూడా ఈ ఘటనకు దారితీసి ఉండవచ్చని కొందరు స్నేహితులు చెబుతున్నారు.
ఈ ఊహించని ఘటనతో సినీ వర్గాలు, అభిమానులు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. పోరూరు పోలీసులు కేసు నమోదు చేసి, పూర్తి వివరాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. దర్యాప్తు పూర్తయిన తర్వాత మరిన్ని వివరాలు వెల్లడి కానున్నాయి.











