తెలంగాణ ప్రభుత్వం 2025 సంవత్సరానికి గాను ప్రతిష్టాత్మక ‘గద్దర్’ సినీ అవార్డులను ప్రకటించింది. తెలుగు సినీ పరిశ్రమకు విశేష సేవలందించిన పలువురు ప్రముఖులకు ఈ పురస్కారాలు దక్కనున్నాయి. వివిధ విభాగాల్లో పలువురు నటులు, దర్శకులు, సాంకేతిక నిపుణులు అవార్డులకు ఎంపికయ్యారు.
ఈ ఏడాది ఎన్టీఆర్ నేషనల్ అవార్డు మెగాస్టార్ చిరంజీవికి, పైడి జయరాజ్ అవార్డు ప్రముఖ నటుడు కమల్ హాసన్‌కు దక్కాయి. అలాగే, ఏఎన్నార్ అవార్డును నటి జయసుధ అందుకోనున్నారు. దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు బీఎన్ రెడ్డి ఫిల్మ్ అవార్డుతో పాటు కాంతారావు అవార్డు కూడా ప్రకటించారు. నిర్మాత అశ్వినీ దత్‌కు నాగిరెడ్డి – చిత్రపాణి ఫిల్మ్ అవార్డు, గేయరచయిత సుద్దాల అశోక్ తేజకు సి. నారాయణరెడ్డి ఫిల్మ్ అవార్డు లభించాయి.
ప్రధాన సినీ విభాగాల్లో, ఉత్తమ నటుడిగా నాగ చైతన్య (తండేల్), ఉత్తమ నటిగా రష్మిక మందన్న (ది గర్ల్ ఫ్రెండ్) ఎంపికయ్యారు. 'రాజు వెడ్స్ రాంబాయి' ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా, 'దండోరా' రెండో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా, 'ది ప్రీ వెడ్డింగ్ షో' మూడో ఉత్తమ ఫీచర్ ఫిల్మ్‌గా నిలిచాయి. 'తండేల్' నేషనల్ ఇంటిగ్రిటీ ఫిల్మ్‌గా, 'ఇగ్వా' ఉత్తమ పర్యావరణ చిత్రంగా, 'లిటిల్ హార్డ్స్' ఉత్తమ డెబ్యూ ఫీచర్ ఫిల్మ్‌గా, 'సంక్రాంతికి వస్తున్నాం' ఉత్తమ వినోదాత్మక చిత్రంగా, 'కోర్టు' ఉత్తమ సోషల్ మెసేజ్ చిత్రంగా, 'మిరాయ్' ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ మూవీగా, 'అనగనగనా' ఉత్తమ బాలల చిత్రంగా అవార్డులు పొందాయి.
వ్యక్తిగత విభాగాల్లో, ఉత్తమ దర్శకుడిగా 'రాజు వెడ్స్ రాంబాయి'కి సాయిలు, ఉత్తమ సపోర్టింగ్ నటుడిగా శివాజీ, ఉత్తమ సపోర్టింగ్ నటిగా భూమిక ఎంపికయ్యారు. ఉత్తమ సంగీత దర్శకుడిగా మార్క్ కె రాబిన్ (దండోరా), ఉత్తమ నేపథ్య గాయకుడిగా అనురాగ్ (రాజు వెడ్స్ రాంబాయి), ఉత్తమ నేపథ్య గాయనిగా సాహితి చాగంటి (కన్నప్ప), ఉత్తమ హాస్యనటుడిగా కృష్ణ తేజ (జిగ్రీస్), ఉత్తమ బాలనటుడిగా రోహన్ రాయ్ (ప్రీ వెడ్డింగ్ షో) అవార్డులు పొందారు. సాంకేతిక విభాగాల్లోనూ పలువురు అవార్డులు అందుకున్నారు.

