భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) నిర్వహిస్తున్న యువికా (Young Scientist Programme) కార్యక్రమానికి చిన్న మల్లారెడ్డి బాలుర ఉన్నత పాఠశాల 9వ తరగతి విద్యార్థిని రావుల నిహారిక ఎంపికైంది. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ ఆశీస్ సాంగ్వాన్, విద్యార్థినిని, ఆమె గైడ్ టీచర్ ను అభినందించారు.
ఇస్రో ప్రతి సంవత్సరం నిర్వహించే యువికా కార్యక్రమంలో భాగంగా, దేశవ్యాప్తంగా సైన్సులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులను ఎంపిక చేసి, వారికి అంతరిక్ష శాస్త్రంపై ప్రత్యేక శిక్షణ అందిస్తుంది. ఈ ఏడాది చిన్న మల్లారెడ్డి పాఠశాల నుంచి రావుల నిహారిక ఈ ప్రతిష్టాత్మక కార్యక్రమానికి ఎంపికైంది. ఎంపిక ప్రక్రియలో విద్యార్థుల ప్రతిభ, విద్యార్హతలు, సైన్స్‌పై ఆసక్తి, ఆన్లైన్ పరీక్షలో సాధించిన మార్కులను పరిగణనలోకి తీసుకున్నారు.
ఎంపికైన నిహారిక ఇస్రో శిక్షణ కేంద్రాల్లో అంతరిక్ష విజ్ఞానం, ఉపగ్రహాల నిర్మాణం, రాకెట్ల పని విధానం, భౌతిక, రసాయన, గణిత శాస్త్ర అంశాలపై ప్రాయోగిక, సైద్ధాంతిక శిక్షణ పొందనుంది. ఈ శిక్షణలో భాగంగా ప్రయోగశాల సందర్శనలు, శాస్త్రవేత్తలతో ముఖాముఖి వంటి కార్యక్రమాలు కూడా ఉంటాయి. ఇది విద్యార్థుల్లో శాస్త్రీయ దృక్పథాన్ని పెంపొందించడానికి దోహదపడుతుంది.
ఈ సందర్భంగా కలెక్టర్ ఆశీస్ సాంగ్వాన్ మాట్లాడుతూ, ఒక గ్రామీణ ప్రాంత విద్యార్థినికి ఇస్రోలో జరుగుతున్న పరిశోధనలు, ప్రయోగాలను తెలుసుకునే అవకాశం, శాస్త్రవేత్తలతో ప్రత్యక్షంగా కలుసుకునే అవకాశం దక్కడం ఎంతో ప్రశంసనీయమని తెలిపారు. ఈ అవకాశం నిహారిక భవిష్యత్తులో శాస్త్రవేత్తగా లేదా ఇంజనీర్‌గా ఎదగడానికి ఒక ముఖ్యమైన మొదటి మెట్టుగా నిలుస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు.
ఈ విజయంతో ఇతర విద్యార్థులకు కూడా ప్రేరణ లభిస్తుందని, భవిష్యత్తులో నిహారిక మరింత ఉన్నత స్థాయికి చేరాలని కలెక్టర్ ఆకాంక్షించారు. గ్రామీణ విద్యార్థుల్లో శాస్త్రంపై ఆసక్తి పెరిగి, మరిన్ని అవకాశాలను అందిపుచ్చుకునే దిశగా ముందుకు సాగుతారని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి శ్రీ సిద్ధ రామిరెడ్డి కూడా పాల్గొన్నారు.











