సంగారెడ్డి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో మహిళల భద్రత, బాలల రక్షణ, మాదక ద్రవ్యాల దుర్వినియోగం, సైబర్ నేరాలపై అవగాహన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా యువత సమాజ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి పిలుపునిచ్చారు.
ప్రజాపాలన – ప్రగతి ప్రణాళిక 99 రోజుల కార్యాచరణలో భాగంగా జిల్లా పోలీసు శాఖ, ఈగల్ ఫోర్స్, జిల్లా సంక్షేమ, చైల్డ్ వెల్ఫేర్, ఎక్సైజ్ శాఖల సమన్వయంతో ఈ అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, యువత చెడు అలవాట్లు, మాదక ద్రవ్యాల బారిన పడకుండా ఉన్నత లక్ష్యాలతో ముందుకు సాగాలని సూచించారు.
మహిళల భద్రతకు షీ టీమ్స్ ద్వారా విస్తృత అవగాహన కల్పిస్తున్నామని, బాధిత మహిళలకు సఖీ, భరోసా కేంద్రాలు అండగా నిలుస్తున్నాయని తెలిపారు. విద్యాసంస్థలు, పని ప్రదేశాల్లో సమస్యలు ఎదురైతే వెంటనే హెల్ప్‌లైన్ నంబర్లకు లేదా షీ టీమ్ నంబర్‌కు సమాచారం అందించాలని, వివరాలు గోప్యంగా ఉంచుతామని హామీ ఇచ్చారు.
యువత అనవసర అలవాట్లకు దూరంగా ఉండి, విద్యపై దృష్టి సారించి ఉన్నత స్థాయికి చేరుకోవాలని ఆయన విద్యార్థులకు సూచించారు. జిల్లా సంక్షేమ అధికారి లలిత కుమారి మాట్లాడుతూ, యువత డ్రగ్స్ ప్రమాదాలపై అవగాహన కలిగి ఉండాలని, డ్రగ్స్ జీవితాలను నాశనం చేస్తాయని హెచ్చరించారు. మిషన్ పరివర్తన్ ద్వారా పాఠశాలలు, కళాశాలల్లో నిరంతరం అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు.












