జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, రెసిడెన్షియల్ పాఠశాలల్లో విద్యార్థులకు అన్ని వసతి సౌకర్యాలతో పాటు నాణ్యమైన విద్యాబోధన అందించాలని జాతీయ మానవ హక్కుల కమిషన్ సభ్యురాలు విజయభారతి సయాని సంబంధిత అధికారులకు సూచించారు.
జిల్లాకు విచ్చేసిన కమిషన్ సభ్యురాలు, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మహిళా, శిశు సంక్షేమ శాఖలతో పాటు రెవెన్యూ, పోలీస్ అధికారులతో సమీక్ష నిర్వహించారు. వసతి గృహాల్లో విద్యార్థులకు అందుతున్న వసతులు, మౌలిక సదుపాయాలు, బోధన ప్రమాణాలు, భోజన నాణ్యతపై ఆరా తీశారు.
శిథిలావస్థలో ఉన్న భవనాలను వెంటనే బాగు చేయాలని, విద్యార్థుల సంఖ్యకు తగినట్లుగా బాత్రూములు, మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. వసతి గృహాల్లో పరిశుభ్రత, భద్రతకు అధిక ప్రాధాన్యత ఇవ్వాలని సూచించారు.
అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలు, గర్భిణీలు, బాలింతలకు సమయానికి గుడ్లు, పౌష్టికాహారం అందేలా చూడాలని, పర్యవేక్షణ పటిష్టంగా ఉండాలని మహిళా, శిశు సంక్షేమ శాఖ అధికారులను కోరారు. అంగన్వాడీ సిబ్బంది సంక్షేమంపై కూడా వివరాలు సేకరించారు.
పోక్సో కేసులు, మానవ అక్రమ రవాణా, నేరాల నియంత్రణపై డి.ఎస్.పితో చర్చించారు. ల్యాండ్ మేనేజ్మెంట్ చట్టాల అమలు, మధ్యాహ్న భోజనానికి బియ్యం సరఫరా వంటి అంశాలపై రెవెన్యూ అధికారులతోనూ సమీక్షించారు.












