ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమంలో భాగంగా మే 11 నుండి ప్రారంభం కానున్న విద్యాశాఖ వారోత్సవాలను సమర్థవంతంగా, ఘనంగా నిర్వహించాలని విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి శ్రీమతి యోగితా రాణా అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్‌లో ఆమె పలు కీలక సూచనలు చేశారు.
ఏడు రోజుల పాటు జరిగే ఈ కార్యక్రమాల నిర్వహణపై ముఖ్య కార్యదర్శి మార్గనిర్దేశం చేశారు. మూడవ రోజున జిల్లా సర్పంచ్‌లతో సమావేశం నిర్వహించి, విద్యాశాఖ కార్యక్రమాలపై అవగాహన కల్పించాలని ఆదేశించారు.
పదవ తరగతిలో ఉత్తీర్ణత సాధించని విద్యార్థుల కోసం సెలవుల్లో ప్రత్యేక తరగతులు నిర్వహించాలని, దీనికి ప్రధానోపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని సూచించారు. వచ్చే విద్యా సంవత్సరంలో పాఠశాలల్లో గుణాత్మక విద్యను పెంపొందించడానికి అకాడమిక్ ప్యానెల్ ఇన్స్పెక్షన్ బృందాలను ఏర్పాటు చేయాలని తెలిపారు.
తెలంగాణ పబ్లిక్ స్కూల్, యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ మోడల్ స్కూల్స్ నిర్మాణ పనులను త్వరితగతిన పూర్తి చేయాలని, బడి మానివేసిన విద్యార్థులను తిరిగి చేర్పించడానికి ప్రత్యేక శ్రద్ధ చూపాలని, అవసరమైన చోట వర్క్‌సైట్ స్కూల్స్ ఏర్పాటు చేయాలని సూచించారు. వారోత్సవాల్లో గ్రంథాలయ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించాలని కోరారు.
పాఠశాలలు ప్రారంభమయ్యే నాటికి పెండింగ్‌లో ఉన్న టాయిలెట్ నిర్మాణాలను పూర్తి చేయాలని, ప్రజా పాలన కార్యక్రమాల్లో భాగంగా పెయింటింగ్‌లు, ఎగ్జిబిషన్లు ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. రానున్న విద్యా సంవత్సరంలో సమగ్ర శిక్ష ఆర్థిక లావాదేవీలు స్పర్శ పోర్టల్‌కు బదిలీ చేయనున్నట్లు తెలిపారు.












