టీటీడీ విద్యాసంస్థల్లో విద్యార్థుల అభ్యున్నతికి, నాణ్యమైన విద్యను అందించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టాలని టీటీడీ జేఈవో (వైద్యం, విద్య) డా. ఎ. శరత్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఇందుకోసం సమగ్ర ప్రణాళికలు రూపొందించాలని సూచించారు.
ఎస్వీ ఆర్ట్స్ కళాశాల సమావేశ మందిరంలో జరిగిన ఒక ఉన్నత స్థాయి సమావేశంలో, జేఈవో డా. ఎ. శరత్ మాట్లాడుతూ, టీటీడీ విద్యాసంస్థల్లో విద్యార్థులకు జ్ఞానం, నైపుణ్యాలు, విలువలతో కూడిన విద్యను అందించాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. ఉపాధ్యాయులు విద్యార్థుల సమగ్రాభివృద్ధికి కృషి చేయాలని ఆయన కోరారు.
విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరచడానికి పర్యవేక్షణ, మార్గదర్శకత్వం, ప్రత్యేక శ్రద్ధ అవసరమని జేఈవో తెలిపారు. ప్రతిభ ఆధారంగా విద్యార్థులను గ్రూపులుగా విభజించి, ఇతరులకు సహాయపడే వాతావరణాన్ని ప్రోత్సహించాలని సూచించారు. చదువులో వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక దృష్టి సారించాలని, బోధనా పద్ధతులను మెరుగుపరచడం ద్వారా 100% ఉత్తీర్ణత సాధించవచ్చని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
వచ్చే విద్యా సంవత్సరం నుంచి పాఠ్యాంశాలను సకాలంలో నవీకరించడం, డిజిటల్ బోధన, స్మార్ట్ క్లాసుల వినియోగం, లెసన్ ప్లాన్ తయారీ వంటి ఆధునిక బోధనా పద్ధతులను అమలు చేయాలని జేఈవో సూచించారు. విద్యార్థులకు కెరీర్ గైడెన్స్, కౌన్సిలింగ్ అందించడంతో పాటు, వారి పురోగతిని నిరంతరం పర్యవేక్షించాలని, తల్లిదండ్రుల అభిప్రాయాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలని ఆయన ఆదేశించారు.
ఈ సందర్భంగా, జాతీయ స్థాయి డోలు వాయిద్య పోటీల్లో ప్రథమ బహుమతి సాధించిన ఎస్వీ మ్యూజిక్ కాలేజీ విద్యార్థి శ్రీ కె. ప్రదీప్‌ను జేఈవో అభినందించారు. ఈ కార్యక్రమంలో డీఈవో, వివిధ కళాశాలల ప్రిన్సిపాల్స్, హెడ్ మాస్టర్లు పాల్గొన్నారు.











