తెలంగాణలో పదవ తరగతి పరీక్షల పవిత్రతకు భంగం కలిగించే సంఘటన చోటుచేసుకుంది. నిజామాబాద్ జిల్లా ఆలూర్ మండలంలో హిందీ ప్రశ్నపత్రం పరీక్ష ప్రారంభమైన కొద్దిసేపటికే వాట్సప్ ద్వారా లీక్ అయింది. ఈ ఘటనపై విచారణ అనంతరం 9 మంది ఉపాధ్యాయులను సస్పెండ్ చేశారు.
ఆలూర్ మండల కేంద్రంలోని జడ్పీ ఉన్నత పాఠశాలలో పదవ తరగతి హిందీ పరీక్ష జరుగుతుండగా, ప్రశ్నాపత్రం ఫోటో తీసి వాట్సాప్ గ్రూపుల్లో పంపినట్లు ఆరోపణలున్నాయి. ఈ లీకేజీ వ్యవహారంలో క్లర్క్ ఉపేందర్, ఇన్విజిలేటర్ నిజాంపూర్ సాగర్ ప్రమేయం ఉన్నట్లు తెలుస్తోంది.
బోధన్, మెండోరా మండలాల పరిధిలోని వాట్సాప్ గ్రూపుల్లో ప్రశ్నపత్రం కనిపించడంతో, జిల్లా విద్యాధికారి (డీఈవో) వెంటనే విచారణకు ఆదేశించారు. ఈ విచారణ నివేదిక ఆధారంగా, కలెక్టర్ ఆదేశాల మేరకు డీఈవో పలువురు ఉపాధ్యాయులపై వేటు వేశారు.
సస్పెండ్ అయిన వారిలో రాజేందర్ (జీహెచ్ఎం, దేగాం), విజయ్ కుమార్ (స్కూల్ అసిస్టెంట్, మచ్చెర్ల), ఉమేందర్ (ఎస్జీటీ, మిర్దాపల్లి), సాగర్ (ఎస్జీటీ, డీకంపల్లి), మమత (జీహెచ్ఎం, ఎస్సారెస్పీ), రవీందర్ (స్కూల్ అసిస్టెంట్, వెల్గటూర్), భూపతి (స్కూల్ అసిస్టెంట్, ఎస్సారెస్పీ), వేణు (స్కూల్ అసిస్టెంట్, పెంటాకలాన్, బోధన్), శివానందరావు (స్కూల్ అసిస్టెంట్, కల్దుర్కి, బోధన్) ఉన్నారు.
ఈ ప్రశ్నాపత్రం లీక్ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పరీక్షల నిర్వహణలో ఇలాంటి సంఘటనలు జరగడం విద్యార్థులలో ఆందోళన కలిగిస్తోంది.











