జిల్లాలో జరుగుతున్న పదవ తరగతి పరీక్షల నేపథ్యంలో, పరీక్ష కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లను అనుమతించరాదని జిల్లా కలెక్టర్ పి.ప్రావీణ్య స్పష్టం చేశారు. ఈ నిబంధనలను కచ్చితంగా పాటించాలని సంబంధిత అధికారులకు ఆమె ఆదేశాలు జారీ చేశారు.
పరీక్షల పారదర్శకత, కట్టుదిట్టమైన నిర్వహణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. పరీక్ష కేంద్రాల్లోకి ఎవరూ మొబైల్ ఫోన్లు తీసుకురావద్దని, కేంద్ర సిబ్బందితో సహా ఎవరి వద్ద కూడా మొబైల్ ఫోన్లు ఉండకూడదని ఆమె స్పష్టం చేశారు.
శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చీఫ్ సూపరింటెండెంట్లు, ఎంఈఓలు, డిపార్ట్మెంటల్ అధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో కలెక్టర్ ఈ ఆదేశాలు జారీ చేశారు. పరీక్ష ప్రారంభానికి ముందు ప్రతి హాలును క్షుణ్ణంగా పరిశీలించాలని సూచించారు.
అన్ని కేంద్రాల్లో సీసీ కెమెరాల పర్యవేక్షణ, ఫ్లయింగ్ స్క్వాడ్ల ద్వారా నిరంతర తనిఖీలు జరుగుతున్నాయని తెలిపారు. ఎలాంటి సంఘటనలకైనా చీఫ్ సూపరింటెండెంట్, ఎంఈఓలే బాధ్యత వహించాలని స్పష్టం చేశారు.
సబ్జెక్ట్ టీచర్లను క్లరికల్ పనులకు కాకుండా, వారి స్థానంలో ఎస్జీటీ కేడర్ ఉపాధ్యాయులను నియమించాలని ఆదేశించారు. వర్షాల నేపథ్యంలో ప్రశ్నాపత్రాలు, ఆన్సర్ షీట్లను సురక్షితంగా తరలించాలని సూచించారు.












