కామారెడ్డి జిల్లా నస్రుల్లాబాద్ మండలంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఇద్దరు ఉపాధ్యాయులు వ్యక్తిగత కారణాలతో విద్యార్థుల సమక్షంలోనే ఘర్షణ పడ్డారు. ఈ సంఘటనలో ఒక ఉపాధ్యాయుడు గాయపడ్డారు.
బొమ్మన్ దేవ్ పల్లి గ్రామంలోని పాఠశాలలో గణిత ఉపాధ్యాయుడు నంద్యాల శ్రీనివాస్, తెలుగు ఉపాధ్యాయుడు రామోజీ శ్రీనివాస్ మధ్య శనివారం వ్యక్తిగత కక్షల కారణంగా వాగ్వాదం తీవ్రమైంది. ఈ క్రమంలో నంద్యాల శ్రీనివాస్, రామోజీ శ్రీనివాస్‌ను కుర్చీతో కొట్టే ప్రయత్నం చేయగా, కుర్చీ ముక్క రామోజీ శ్రీనివాస్ ముక్కుపై తగిలి గాయాలయ్యాయి. దీంతో అతన్ని స్థానిక ఆసుపత్రికి తరలించి, అనంతరం నిజామాబాద్ ఆసుపత్రికి తరలించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం, గత పార్లమెంట్ ఎన్నికల సమయంలో జరిగిన సర్వే బిల్లుల వివాదమే ఈ ఘర్షణకు దారితీసినట్లు తెలుస్తోంది. సర్వే చేసిన వారికి బిల్లులు చేయకుండా, కొందరికి మాత్రమే ఎలా చేస్తారనే దానిపై వివాదం మొదలైనట్లు సమాచారం. ఈ విషయంలోనే నంద్యాల శ్రీనివాస్, రామోజీ శ్రీనివాస్‌తో గొడవకు దిగినట్లు బాధితుడు ఆరోపించారు.
ఘటన జరిగిన సమయంలో ప్రధానోపాధ్యాయుడు జోక్యం చేసుకుని, ఫిర్యాదు చేయకుండా అడ్డుకున్నారని బాధితుడు ఆరోపించారు. యూనియన్ నాయకులు జోక్యం చేసుకుని ఇరువర్గాల మధ్య రాజీ కుదిర్చే ప్రయత్నం చేసినట్లు తెలిసింది. విద్యార్థులకు క్రమశిక్షణ నేర్పాల్సిన ఉపాధ్యాయుల ప్రవర్తనపై తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
బాధితుడు శ్రీనివాస్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఉపాధ్యాయుల మధ్య జరిగిన ఈ సంఘటన మండలంలో కలకలం సృష్టించింది.

