సంగారెడ్డిలోని తారా ప్రభుత్వ కళాశాలలో "జీవశాస్త్ర భవిష్యత్తు: కంప్యూటేషనల్ ఇంటెలిజెన్స్ మరియు బయోలాజికల్ రీసెర్చ్" అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు మంగళవారం ప్రారంభమైంది.
జీవశాస్త్రం మరియు కంప్యూటర్ విభాగాల ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ సదస్సులో రాష్ట్ర ఉన్నత విద్యా విభాగం సంయుక్త డైరెక్టర్లు ప్రొఫెసర్ బాలభాస్కర్, ప్రొఫెసర్ రాజేందర్ సింగ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో వారు సదస్సు పోస్టర్ను ఆవిష్కరించారు.
ఈ సదస్సు ఎంచుకున్న అంశం జీవశాస్త్రంలో వస్తున్న మార్పులకు అనుగుణంగా ఉందని, భవిష్యత్తు పరిశోధనలకు దోహదపడుతుందని అతిథులు అభిప్రాయపడ్డారు. కళాశాల అభివృద్ధికి అవసరమైన సహకారం అందిస్తామని హామీ ఇచ్చారు.
మొదటి రోజు టెక్నికల్ సెషన్లలో హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ మంజరి కిరణ్, డాక్టర్ శశి కిరణ్, జవహర్ లాల్ నెహ్రూ టెక్నోలాజికల్ విశ్వవిద్యాలయం, సుల్తాన్పూర్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. విశ్వనాథ్ వివిధ అంశాలపై ప్రసంగించారు. ఆధునిక పరిశోధనలు ఇంటెలిజెన్స్పైనే ఆధారపడి ఉన్నాయని, ఇది భవిష్యత్తులో అనేక మార్పులకు కారణమవుతుందని డాక్టర్ విశ్వనాథ్ తెలిపారు.
ఈ సదస్సులో రాష్ట్రంలోని వివిధ విశ్వవిద్యాలయాల పరిశోధకులు, ఇతర రాష్ట్రాల నుండి వచ్చిన పరిశోధకులు తమ పరిశోధనా పత్రాలను సమర్పించారు. సదస్సుకు లభించిన స్పందన పట్ల నిర్వాహకులు సంతృప్తి వ్యక్తం చేశారు.


