మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా నాగారంకు చెందిన ఎస్ఎస్కే మార్షల్ ఆర్ట్స్ అకాడమీ విద్యార్థులు గచ్చిబౌలి ఇండోర్ స్టేడియంలో జరిగిన గిన్నిస్ వరల్డ్ రికార్డ్ అటెంప్ట్‌లో పాల్గొని, తమ ప్రతిభతో అంతర్జాతీయ గుర్తింపు పొందారు. దేశవ్యాప్తంగా 2,000 మందికి పైగా కరాటే విద్యార్థులు పాల్గొన్న ఈ కార్యక్రమంలో ఎస్ఎస్కే అకాడమీ నుంచి 48 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ కార్యక్రమంలో, ఎస్ఎస్కే అకాడమీ విద్యార్థులు 25 నిమిషాల పాటు నిరంతరాయంగా "కటా" ప్రదర్శన చేసి, కరాటేలో శారీరక నియంత్రణ, క్రమశిక్షణ, శక్తి, టెక్నిక్‌ల సమన్వయాన్ని ప్రదర్శించారు. నిర్వాహకుల ప్రకారం, ఒకేసారి ఇంత పెద్ద సంఖ్యలో విద్యార్థులు సమన్వయంతో ప్రదర్శన ఇవ్వడం అత్యంత క్లిష్టమైనది. ఎస్ఎస్కే అకాడమీ విద్యార్థులు అద్భుతమైన సమన్వయం, కఠిన శిక్షణతో ఈ సవాల్‌ను విజయవంతంగా పూర్తి చేశారు.
గిన్నిస్ రికార్డు కార్యక్రమంలో ఆరేళ్ల చిన్నారుల నుంచి 80 ఏళ్ల వృద్ధుల వరకు పాల్గొనడం విశేషం. ఇది వయసుతో సంబంధం లేకుండా పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చని నిరూపించింది. ఈ రికార్డు సాధనలో మాస్టర్ కే. సాయి కిరణ్ 22 ఏళ్ల కృషి, 26 ఏళ్ల కల ఉందని ఆయన తెలిపారు. విద్యార్థులను శారీరకంగా, మానసికంగా సిద్ధం చేయడానికి ఆయన నిరంతరం కృషి చేశారు.
మాస్టర్ సాయి కిరణ్ ఉచితంగా కరాటే శిక్షణను అందిస్తూ, విద్యార్థులను జాతీయ, అంతర్జాతీయ స్థాయికి తీసుకెళ్తున్నారు. ముఖ్యంగా, ఆడపిల్లలకు ఆత్మరక్షణపై అవగాహన కల్పించడం ద్వారా సమాజానికి సేవ చేస్తున్నారు. ఈ విజయం ఎస్ఎస్కే మార్షల్ ఆర్ట్స్ అకాడమీకే కాకుండా, తెలంగాణ, తెలుగు రాష్ట్రాలకు గర్వకారణంగా నిలిచిందని పలువురు అభినందించారు. విద్యార్థుల పట్టుదల, తల్లిదండ్రుల ప్రోత్సాహం, గురువుల మార్గదర్శకత్వం ఈ చారిత్రాత్మక విజయానికి కారణమయ్యాయి.











