ఆర్టీఈ చట్టం 12(1) సి ప్రకారం 2026-27 విద్యా సంవత్సరానికి ప్రైవేటు పాఠశాలల్లో పేద విద్యార్థులకు కేటాయించిన 25 శాతం ఉచిత ప్రవేశాలకు సంబంధించి మొదటి విడత లాటరీ ఫలితాల తుది జాబితా విడుదల చేయబడింది. ఈ లాటరీలో 30,075 మంది విద్యార్థులకు సీట్లు కేటాయించినట్లు సమగ్ర శిక్ష రాష్ట్ర పథక సంచాలకులు శ్రీ బి. శ్రీనివాసరావు ఐఏఎస్ తెలిపారు.
రాష్ట్ర వ్యాప్తంగా 54,647 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, వారిలో 54,016 మంది అర్హులుగా గుర్తించబడ్డారు. మొదటి విడత లాటరీలో ఒక కిలోమీటర్ పరిధిలోని 30,075 మంది విద్యార్థులు ఎంపికయ్యారు. ఎంపికైన విద్యార్థుల సమాచారం తల్లిదండ్రుల మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా అందుబాటులో ఉంటుందని, అలాగే https://cse.ap.gov.in/ వెబ్సైట్ లో కూడా లభ్యమవుతుందని అధికారులు వెల్లడించారు.
విద్యార్థుల ప్రవేశాల నిర్ధారణ కోసం తల్లిదండ్రులు విద్యార్థి, తల్లి లేదా తండ్రి ఆధార్ కార్డు, ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, విద్యార్థి జనన ధ్రువీకరణ పత్రం, రేషన్ కార్డు, తోబుట్టువుల ఆధార్, స్టడీ సర్టిఫికేట్ వంటి పత్రాలను 26.03.2026 నుండి 07.04.2026 లోపు సంబంధిత పాఠశాలలకు సమర్పించాల్సి ఉంటుంది.
ఐదు కిలోమీటర్ల పరిధిలోని విద్యార్థులకు సంబంధించిన రెండో విడత లాటరీ ఫలితాలు ఏప్రిల్ 12న విడుదల చేయబడతాయి. ప్రవేశాలకు సంబంధించి పూర్తి వివరాలు మరియు సందేహాల నివృత్తి కోసం టోల్ ఫ్రీ నంబర్ 18004258599 ను సంప్రదించవచ్చని సూచించారు.
పాఠశాల యాజమాన్యాలు ధ్రువీకరణ పత్రాలను సరిచూసుకుని అడ్మిషన్లు ఇవ్వాలని, సరైన కారణం లేకుండా ప్రవేశాలను నిరాకరిస్తే శాఖాపరమైన చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. ఈ అడ్మిషన్ల ప్రక్రియను సమగ్ర శిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కో ఆర్డినేటర్లు (ఏపీసీలు) పర్యవేక్షిస్తారు.










