ప్రైవేట్ పాఠశాలలు విద్యార్థుల తల్లిదండ్రులపై పుస్తకాలు కొనుగోలు చేయాలని ఒత్తిడి చేస్తున్నాయన్న ఆరోపణలపై నేషనల్ హ్యూమన్ రైట్స్ కమిషన్ (NHRC) తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విరుద్ధంగా ప్రైవేట్ పబ్లిషర్ల పుస్తకాలను కొనుగోలు చేయాలని బలవంతం చేస్తున్నట్లు దేశవ్యాప్తంగా ఫిర్యాదులు వెల్లువెత్తడంతో కమిషన్ సుమోటోగా ఈ కేసును స్వీకరించింది.
2026-27 విద్యా సంవత్సరం ప్రారంభం కాకముందే అనేక ప్రైవేటు పాఠశాలలు తల్లిదండ్రులపై ఆర్థిక భారం మోపుతూ, తమకు అనుబంధంగా ఉన్న పబ్లికేషన్ల పుస్తకాలను తప్పనిసరిగా కొనాలని ఒత్తిడి చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. ముఖ్యంగా స్కూల్ ఆవరణలోనే లేదా ప్రత్యేకంగా సూచించిన దుకాణాల్లోనే పుస్తకాలు కొనాలని నిబంధనలు విధించడం వల్ల తల్లిదండ్రులు ఇబ్బందులు పడుతున్నారని కమిషన్ దృష్టికి వచ్చింది.
ఈ నేపథ్యంలో, కమిషన్ అన్ని రాష్ట్ర ప్రభుత్వాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలకు నోటీసులు జారీ చేసింది. ప్రైవేటు పాఠశాలలు తీసుకుంటున్న ఏకపక్ష నిర్ణయాలు, తల్లిదండ్రులపై పడుతున్న అదనపు ఖర్చులపై పూర్తి వివరాలు సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాల విద్యాశాఖలను ఆదేశించింది. అలాగే, కమిషన్లు వచ్చే పబ్లికేషన్లనే కొనాలని బలవంతం చేస్తున్నారా అనే అంశంపై స్పష్టమైన వివరణ కోరింది.
జాతీయ స్కూల్ బ్యాగ్ విధానం ప్రకారం విద్యార్థులపై పుస్తకాల భారం తగ్గించేలా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం ఇప్పటికే మార్గదర్శకాలు జారీ చేసింది. ఈ నిబంధనల ప్రకారం అవసరానికి మించిన పుస్తకాలను విద్యార్థులపై రుద్దకూడదు. కానీ అనేక పాఠశాలలు ఈ నియమాలను పట్టించుకోవడం లేదని కమిషన్ అభిప్రాయపడింది. ప్రభుత్వం నిర్దేశించిన పాఠ్యపుస్తకాలనే అమలు చేయాలని, స్కూల్ బ్యాగ్ బరువు తగ్గించేలా తక్షణ చర్యలు తీసుకోవాలని సూచించింది.
ఇకపై పాఠశాలలు తల్లిదండ్రులను ఒకే చోట లేదా నిర్దిష్ట దుకాణాల్లోనే పుస్తకాలు కొనాలని ఒత్తిడి చేయరాదని కూడా కమిషన్ స్పష్టం చేసింది. ఈ అంశంపై పూర్తి స్థాయిలో విచారణ జరిపి, తీసుకున్న చర్యలపై నివేదిక సమర్పించాలని రాష్ట్ర ప్రభుత్వాల విద్యాశాఖ కార్యదర్శులను కమిషన్ ఆదేశించింది. అవసరమైతే సంబంధిత పాఠశాలలపై కఠిన చర్యలు తీసుకునే అవకాశముందని కూడా సంకేతాలు ఇచ్చింది.










