నిజామాబాద్, 2026-07-25
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి లోకానికి దక్కిన నైతిక విజయమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో జరిగిన ఉద్యమం ఫలితంగానే ఈ పరిణామం చోటుచేసుకుందని ఆయన అన్నారు.
కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా విద్యార్థి లోకానికి దక్కిన నైతిక విజయమని టీపీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ పేర్కొన్నారు. కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీతో పాటు బీజేపీయేతర రాజకీయ పక్షాలు చేపట్టిన ఉద్యమం ఫలితంగానే ఈ పరిణామం చోటుచేసుకుందని ఆయన అన్నారు.
ప్రజాస్వామ్యంలో ప్రజల ఉద్యమానికి చివరికి ప్రతి ప్రభుత్వం తలొగ్గాల్సిందేనని, నియంతృత్వ ధోరణులకు స్థానం లేదని ఈ ఘటన మరోసారి స్పష్టం చేసిందన్నారు. విద్యార్థుల హక్కుల పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ నిరంతరం సాగించిన పోరాటమే ఈ విజయానికి ప్రధాన కారణమని ఆయన వ్యాఖ్యానించారు.
విద్యార్థులపై జరిగిన లాఠీచార్జ్‌ను ప్రపంచం మొత్తం గమనించిందని పేర్కొన్న మహేష్ కుమార్ గౌడ్, భవిష్యత్తులో ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం కఠినమైన, సమగ్ర చట్టాన్ని తీసుకురావాలని డిమాండ్ చేశారు.
అలాగే, రాహుల్ గాంధీ పార్లమెంట్లో చేసిన విజ్ఞప్తి మేరకు, కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచించినట్లుగా ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంపై పార్లమెంట్లో సమగ్ర చర్చ నిర్వహించాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు.
ప్రశ్నాపత్రాల లీకేజీ ఘటనల కారణంగా ప్రాణాలు కోల్పోయిన విద్యార్థుల కుటుంబాలకు తగిన ఆర్థిక సహాయం అందించడంతో పాటు, విద్యార్థులు చేస్తున్న న్యాయమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని కేంద్ర ప్రభుత్వాన్ని మహేష్ కుమార్ గౌడ్ విజ్ఞప్తి చేశారు.









