కామారెడ్డి పట్టణంలోని ఆర్కే డిగ్రీ అండ్ పీజీ కళాశాలలో జిల్లా స్థాయి వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్–2026 కార్యక్రమం గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యువత అభిప్రాయాలు, సూచనలు వినిపించగా, రాష్ట్ర స్థాయికి ఐదుగురు విద్యార్థులు ఎంపికయ్యారు.
ఆర్కే డిగ్రీ కళాశాల, తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ సౌత్ క్యాంపస్ మరియు మేరా యువభారత్ కామారెడ్డి సంయుక్త ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో, mybharat.gov.in పోర్టల్లో నమోదు చేసుకున్న విద్యార్థులు దేశ అభివృద్ధి, యువత పాత్ర, మహిళా సాధికారత, వ్యవసాయం వంటి అంశాలపై తమ అభిప్రాయాలను వ్యక్తం చేశారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యంతో యువతలో దేశభక్తిని పెంపొందించడం ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యం.
కామారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్ మదన్ మోహన్ ముఖ్య అతిథిగా హాజరై, దేశ నిర్మాణంలో యువత పాత్ర కీలకమని, వారి ఆలోచనలు, ఆవిష్కరణలు సమాజ అభివృద్ధికి దోహదపడాలని సూచించారు. ఈ కార్యక్రమం ద్వారా యువతలో సృజనాత్మకత, నాయకత్వ లక్షణాలు పెంపొందుతాయని ఆయన పేర్కొన్నారు.
కార్యక్రమంలో జిల్లా యువజన అధికారి శైలీ బెల్లాల్, ఆర్కే కళాశాల సీఈఓ డాక్టర్ ఎం. జైపాల్ రెడ్డి, తెలంగాణ యూనివర్సిటీ ఎన్ఎస్ఎస్ ప్రొఫెసర్ అపర్ణతో పాటు పలువురు అధికారులు, అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా నిర్వహించిన ప్రసంగ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఐదుగురు విద్యార్థులను రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. ఎంపికైన వారిలో యాస్మిన్ సుల్తానా, సుదీక్షా రెడ్డి, అంజలి, సుధాంషు, హర్షిని ఉన్నారు. ఎంపికైన విద్యార్థులను అతిథులు అభినందించారు.

