మార్చి-2026లో నిర్వహించిన పదవ తరగతి పరీక్షల్లో కామారెడ్డి జిల్లా 97.47% ఉత్తీర్ణతతో రాష్ట్రంలోనే అత్యుత్తమ ఫలితాలను సాధించింది. జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మార్గదర్శకత్వంలో 191 పాఠశాలలు 100% ఉత్తీర్ణత సాధించాయి.
జిల్లా కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ సూచనలు, సలహాలు, నిరంతర మార్గదర్శకత్వంతో ఈ అద్భుత ఫలితాలు సాధ్యమయ్యాయని అధికారులు తెలిపారు. ప్రతిరోజూ ప్రత్యేక తరగతులు నిర్వహించడం, ఉపాధ్యాయుల కృషి, విద్యార్థుల క్రమశిక్షణ వంటి అంశాలు గతేడాది కంటే 2.82% ఉత్తీర్ణత శాతం పెరగడానికి దోహదపడ్డాయి.
జిల్లా స్థాయిలో ఎస్.పి.ఆర్ పాఠశాల విద్యార్థులు డి. సుహృత్, పి. క్యూరీ, బి. శ్రీ మహర్షి ఉత్తమ మార్కులతో మొదటి మూడు స్థానాల్లో నిలిచారు. లిటిల్ స్కాలర్స్ పాఠశాల విద్యార్థిని ఎం. సుదీక్ష కూడా తృతీయ స్థానాన్ని కైవసం చేసుకుంది.
ప్రభుత్వ పాఠశాలల విభాగంలో, జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల, దోమకొండ విద్యార్థిని ప్రణవి ప్రథమ స్థానం సాధించగా, జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల, జంగంపల్లి విద్యార్థినులు ఎం. సౌందర్య, ఎన్. భవాని ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచారు.
కలెక్టర్ ఆశిష్ సంగ్వాన్ మాట్లాడుతూ, ఈ విజయం విద్యార్థుల కృషి, ఉపాధ్యాయుల అంకితభావం, తల్లిదండ్రుల సహకారంతోనే సాధ్యమైందని, 100% ఉత్తీర్ణత సాధించిన పాఠశాలలను, మెరిట్ విద్యార్థులను అభినందించారు. వచ్చే ఏడాది మరింత మెరుగైన ఫలితాల కోసం ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు.









