వన్నెల్(కె) (ప్రశ్న ఆయుధం) జూలై 28
నందిపేట్ మండలం వన్నెల్(కె) గ్రామంలోని గ్రేస్ ఫెలో పాఠశాలలో కంటైనర్లలో తరగతులు నిర్వహించడం విద్యార్థుల ఆరోగ్యానికి, భద్రతకు ప్రమాదకరమని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షుడు కృపాల్ సింగ్ సోడి ఆరోపించారు. కనీస సౌకర్యాలు లేకున్నా పాఠశాలకు అనుమతులు ఎలా ఇచ్చారని ఆయన ప్రశ్నించారు.
నందిపేట్ మండలం వన్నెల్(కె) గ్రామంలోని గ్రేస్ ఫెలో పాఠశాలలో కంటైనర్లలో విద్యార్థులకు బోధన నిర్వహించడం వల్ల చిన్నారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పీఆర్టీయూ తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షుడు కృపాల్ సింగ్ సోడి ఆరోపించారు. అగ్గిపెట్టెలను తలపించే ఇరుకైన కంటైనర్లలో తరగతులు నిర్వహించడం విద్యార్థుల ఆరోగ్యానికి, భద్రతకు ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు.
పాఠశాలలో తగిన తరగతి గదులు, క్రీడా మైదానం, శిక్షణ పొందిన ఉపాధ్యాయులు వంటి కనీస సౌకర్యాలు లేకపోయినా, సంబంధిత పాఠశాలకు అనుమతుల కోసం నందిపేట్ మండల విద్యాధికారి (ఎంఈఓ) ఎలా సిఫారసు చేశారో విచారణ జరపాలని ఆయన డిమాండ్ చేశారు. పాఠశాలను క్షేత్రస్థాయిలో పరిశీలించకుండా తనిఖీ నివేదికలు, చెక్లిస్టులపై సంతకాలు చేసి జిల్లా విద్యాశాఖకు పంపడం బాధ్యతారాహిత్యానికి నిదర్శనమని విమర్శించారు.
అలాగే జిల్లా విద్యాశాఖ కార్యాలయంలో సంబంధిత అధికారులు పత్రాలను సమగ్రంగా పరిశీలించకుండానే అనుమతులు మంజూరు చేయడం కూడా విచారకరమని అన్నారు. సరైన మౌలిక సదుపాయాలు లేకపోయినా, శిక్షణ లేని ఉపాధ్యాయులతో బోధన కొనసాగిస్తూ కార్పొరేట్ పాఠశాల పేరుతో అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని ఆరోపించారు.
ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేపట్టి, బాధ్యులైన నందిపేట్ ఎంఈఓపై శాఖాపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు గ్రేస్ ఫెలో పాఠశాల అనుమతిని తక్షణమే రద్దు చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారిని కృపాల్ సింగ్ సోడి డిమాండ్ చేశారు.










