నిజామాబాద్, జూలై 28
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, లేదంటే జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి హెచ్చరించారు. ఈ డిమాండ్‌తో ఇందూరు బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థుల సంతకాల సేకరణ, మిస్‌కాల్ ఉద్యమాన్ని ప్రారంభించారు.
ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని, లేనిపక్షంలో జిల్లా వ్యాప్తంగా ఆందోళనలు చేపడతామని బీజేపీ జిల్లా అధ్యక్షుడు దినేష్ పటేల్ కులాచారి హెచ్చరించారు.
ప్రైవేట్ కళాశాలల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిల విడుదలను డిమాండ్ చేస్తూ ఇందూరు బీజేవైఎం ఆధ్వర్యంలో విద్యార్థుల సంతకాల సేకరణ, మిస్‌కాల్ ఉద్యమాన్ని మంగళవారం ప్రారంభించారు. బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమంలో దినేష్ పటేల్ ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు.
ఎన్నికల సమయంలో విద్యార్థులకు ఇచ్చిన హామీలను కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విస్మరించిందని ఆయన విమర్శించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల కాకపోవడంతో వేలాది మంది విద్యార్థులు చదువులు కొనసాగించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, ప్రైవేట్ కళాశాలల యాజమాన్యాలు ఫీజుల కోసం ఒత్తిడి తెస్తున్నాయని పేర్కొన్నారు. దీంతో పేద, మధ్యతరగతి కుటుంబాల విద్యార్థులు అప్పులు చేసి చదువుకోవాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్య హక్కును పరిరక్షించాల్సిన ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం బాధాకరమని, పెండింగ్‌లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను తక్షణమే విడుదల చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే జిల్లా వ్యాప్తంగా విద్యార్థులతో కలిసి భారీ స్థాయిలో ఆందోళనలు, ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు.
బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు వంశీ గౌడ్ మాట్లాడుతూ విద్యార్థుల సమస్యల పరిష్కారం కోసం తమ సంస్థ నిరంతరం పోరాడుతుందని చెప్పారు. సంతకాల సేకరణ ద్వారా విద్యార్థుల అభిప్రాయాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తున్నామని, బకాయిలను వెంటనే విడుదల చేయాలని కోరారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం రాష్ట్ర కో-కోశాధికారి అమంద్ విజయ్ కృష్ణ, బీజేపీ జిల్లా నాయకులు విపుల్ రావు, రాకేష్, రాజ్ గణేష్, బీజేపీ ఎస్టీ మోర్చా జిల్లా అధ్యక్షుడు ఓం సింగ్, బీజేవైఎం నాయకుడు సాయి ప్రవీణ్‌తో పాటు బీజేపీ, బీజేవైఎం నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు పాల్గొన్నారు.










