మేడ్చల్ మండలం పూడూరు గ్రామంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను జిల్లా కలెక్టర్ మను చౌదరి గురువారం ఆకస్మికంగా సందర్శించారు. పాఠశాలలోని విద్యా ప్రమాణాలు, మౌలిక వసతులు, మధ్యాహ్న భోజన నాణ్యతపై ఆయన సమగ్రంగా పరిశీలించారు.
కలెక్టర్ విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతో ముఖాముఖి నిర్వహించి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. దూర ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు రవాణా సమస్యలు ఎదురవుతున్నాయని, పాఠశాలకు ప్రత్యేక బస్సు సౌకర్యం కల్పించాలని తల్లిదండ్రులు కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్, విద్యార్థుల సంఖ్య పెరిగితే కొత్త స్కూల్ బస్సు కొనుగోలు అంశాన్ని పరిశీలిస్తామని హామీ ఇచ్చారు.
పాఠశాలలోని కంప్యూటర్, సైన్స్ ల్యాబ్లను కలెక్టర్ పరిశీలించారు. ప్రయోగాల నిర్వహణ, విద్యార్థుల ప్రాక్టికల్ నేర్చుకునే విధానం గురించి ఇన్స్ట్రక్టర్లతో చర్చించారు. విద్యా ప్రమాణాల మెరుగుదలకు అవసరమైన పరికరాలు, సదుపాయాలపై సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
మధ్యాహ్న భోజన పథకం అమలు తీరును ప్రత్యక్షంగా పరిశీలించేందుకు కలెక్టర్ విద్యార్థులతో కలిసి భోజనం చేశారు. మెనూ ప్రకారం ఆహారం అందుతున్నదా? భోజన నాణ్యత ఎలా ఉందని విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం వంట గదిని పరిశీలించి, అక్కడి సిబ్బందికి అవసరమైన పరికరాలపై ఆరా తీశారు.
“ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాలు పెంచడమే మా లక్ష్యం. విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించేందుకు జిల్లా యంత్రాంగం కట్టుబడి ఉంది” అని కలెక్టర్ మను చౌదరి పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా విద్యాశాఖాధికారి, డిప్యూటీ తహసీల్దార్, రెవెన్యూ ఇన్స్పెక్టర్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయ బృందం పాల్గొన్నారు.






