సంగారెడ్డి, జూలై 12
సదాశివపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1975-76 SSC బ్యాచ్ విద్యార్థులు 50 ఏళ్ల సుదీర్ఘ విరామం తర్వాత గోల్డెన్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనంలో కలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ తన సహచరులతో కలిసి బాల్య జ్ఞాపకాల్లో మునిగిపోయారు. ఒకరినొకరు ఆప్యాయంగా పలకరించుకుంటూ పాత రోజులను గుర్తుచేసుకున్నారు.
సదాశివపేట ప్రభుత్వ ఉన్నత పాఠశాల 1975-76 SSC బ్యాచ్ గోల్డెన్ జూబ్లీ ఆత్మీయ సమ్మేళనం అపూర్వ జ్ఞాపకాలకు వేదికైంది. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ పాల్గొని తన పదో తరగతి సహచరులతో కలిసి బాల్య జ్ఞాపకాల్లోకి వెళ్లిపోయారు. ఎన్నో ఏళ్ల తర్వాత ఎదురుపడిన నేస్తాలను చూడగానే ముఖాల్లో చిరునవ్వులు విరిశాయి. ఒకరినొకరు ఆప్యాయంగా కౌగిలించుకున్నారు.
“ఎలా ఉన్నావురా..?” అంటూ పలకరించుకుంటూ ఆనాటి పాఠశాల రోజులు, తరగతి గదుల్లో చేసిన అల్లరి, గురువుల మందలింపులు, కలిసి పంచుకున్న నవ్వులను గుర్తుచేసుకున్నారు. కొన్ని జ్ఞాపకాలు నవ్విస్తే.. మరికొన్ని కళ్లను చెమ్మగిల్లేలా చేశాయి. తమకు అక్షరాలు నేర్పి, జీవితానికి దారి చూపిన గురువులు సైతం సమావేశానికి హాజరుకావడంతో పూర్వ విద్యార్థుల ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. గురువులను ఆప్యాయంగా పలకరించి వారి ఆశీస్సులు తీసుకున్నారు.
50 ఏళ్ల నాటి మిత్రులందరినీ ఒక్కతాటిపైకి తీసుకొచ్చేందుకు కృషి చేసిన ఎమ్మెల్యే చింత ప్రభాకర్‌కు బ్యాచ్మేట్లు హృదయపూర్వక కృతజ్ఞతలు తెలిపారు. ఇలాంటి ఆత్మీయ కలయికలు మున్ముందు కూడా కొనసాగాలని ఆకాంక్షించారు. కార్యక్రమానికి వచ్చిన చిన్ననాటి మిత్రులను ఎమ్మెల్యే చింత ప్రభాకర్ శాలువాలతో సత్కరించి తన ఆత్మీయతను చాటుకున్నారు.
ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింత ప్రభాకర్ మాట్లాడుతూ.. చాలా ఏళ్ల తర్వాత నా పదో తరగతి స్నేహితులందరినీ ఇలా ఒకే చోట చూడటం మాటల్లో చెప్పలేని ఆనందాన్ని ఇస్తోంది. ఈ వయసులో కూడా మనమంతా సంతోషంగా కలుసుకోవడం నిజంగా మన అదృష్టం.. దేవుడి దయ అని అన్నారు. మీలో ఎవరికైనా ఏ కష్టం వచ్చినా.. అది నా పరిధిలో పరిష్కరించగలిగేది అయితే తప్పకుండా అండగా ఉంటా.. మీకు సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటా. నా రాజకీయ ప్రయాణంలో రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానంటే అందులో మీ ప్రేమ, మీ కృషి, మీ ఆశీస్సులు మరువలేనివని పేర్కొన్నారు. చిన్ననాటి మిత్రులతో కలిసి నవ్వులు పంచుకుంటూ, ఫొటోలు దిగుతూ చింత ప్రభాకర్ ఉత్సాహంగా గడిపారు.
ఈ కార్యక్రమంలో రాములు గౌడ్, ఎం.వెంకటేశం, జనార్దన్, మనోహర్, కాసాల బుచ్చిరెడ్డి, విజేందర్ రెడ్డి, చింత సాయినాథ్, సుధీర్ రెడ్డి, చిక్కుల మల్లేశం, రామప్ప, శ్రీధర్ రెడ్డి, చక్రపాణి, విఠల్, పెద్దగొల్ల ఆంజనేయులు, అమరేందర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.











