శ్రీ పరాభవ నామ సంవత్సరాది ఉగాది పండుగను మార్చి 19, గురువారం నాడు జరుపుకోవాలని పండితులు పంచాంగ నిర్ణయాల ఆధారంగా తెలిపారు. ఈ సందర్భంగా పూజలు, కొత్త ప్రారంభాలకు శుభ ముహూర్తాలను నిర్ధారించారు.
చైత్ర మాస శుద్ధ పాడ్యమి సందర్భంగా తెలుగు సంవత్సరాది ఉగాది పండుగను మార్చి 19న జరుపుకోనున్నారు. చాంద్రమాన పంచాంగం ప్రకారం శ్రీ పరాభవ నామ సంవత్సరానికి ఆరంభంగా ఈ వేడుకలను సంప్రదాయబద్ధంగా నిర్వహించాలని పండితులు సూచించారు.
పంచాంగ నిర్ణయాల ప్రకారం, ఉదయం తైలాభ్యంగ స్నానం చేసి నూతన వస్త్రాలు ధరించడం శ్రేయస్కరం. ఉదయం 7:30 గంటలలోపు ఇష్టదేవతా దర్శనం, పూజలు నిర్వహించడం మంచిది. అలాగే ఉదయం 10:10 గంటలలోపు ఉగాది పచ్చడి స్వీకరణ, పంచాంగ శ్రవణం, పండితుల ఆశీస్సులు పొందడం శుభఫలితాలను ఇస్తుందని పేర్కొన్నారు.
కొత్త ప్రారంభాలకు సంబంధించి కూడా శుభ ముహూర్తాలను సూచించారు. నూతన వ్యాపారాలు, చిట్టా పుస్తకాల ప్రారంభం, వాహనాలు, ఆభరణాల కొనుగోలు వంటి కార్యక్రమాలకు ఉదయం 11:05 గంటల నుంచి మధ్యాహ్నం 2:45 గంటల వరకు అనుకూల సమయంగా నిర్ణయించారు. ఈ సమయంలో చేపట్టే పనులు విజయవంతమవుతాయని విశ్వాసం.
సంప్రదాయ విశ్వాసాల ప్రకారం, ఉగాది రోజున పసుపు, బంగారం, బెల్లం, ఉప్పు వంటి వస్తువులను కొనుగోలు చేయడం శుభప్రదంగా భావిస్తారు. కొత్త సంవత్సరాన్ని ఆనందంగా, ఆధ్యాత్మికంగా ఆరంభించేందుకు ఈ ఆచారాలను పాటించాలని పండితులు సూచిస్తున్నారు.











