సంగారెడ్డి, జూలై 10
సంగారెడ్డి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ అధ్యక్షతన నెలవారీ నేర సమీక్షా సమావేశం జరిగింది. ఈ సందర్భంగా పెండింగ్ కేసుల పరిష్కారం, ప్రజా భద్రత, కమ్యూనిటీ అవగాహన కార్యక్రమాలపై కీలక సూచనలు చేశారు. ప్రతి కేసులోనూ నాణ్యమైన, వేగవంతమైన దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.
మంత్లీ క్రైమ్ రివ్యూ మీటింగ్లో భాగంగా శుక్రవారం సంగారెడ్డి జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ పరితోష్ పంకజ్ నెలవారీ నేర సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. దర్యాప్తు నాణ్యత, పెండింగ్ కేసుల పరిష్కారం, ప్రజా భద్రత, కమ్యూనిటీ అవగాహన కార్యక్రమాలపై పలు కీలక సూచనలు చేశారు.
ఈ సందర్భంగా వివిధ పోలీసు స్టేషన్ల పరిధిలో అండర్ ఇన్వెస్టిగేషన్లో ఉన్న గ్రేవ్, నాన్-గ్రేవ్, మిస్సింగ్, ఎన్బీడబ్ల్యూ కేసుల పురోగతిని సమీక్షించిన ఎస్పీ, ప్రతి కేసులో వేగవంతమైన, నాణ్యమైన దర్యాప్తు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. లాంగ్ పెండింగ్ కేసుల ఛేదనకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక ఉండాలని, నిర్ణీత గడువులోగా దర్యాప్తు పూర్తి చేసి చార్జ్షీట్లు దాఖలు చేయాలని సూచించారు. గ్రేవ్ కేసులలో సైంటిఫిక్ ఆధారాలను సేకరించి, నిందితులకు శిక్షపడేలా కృషి చేయాలని అధికారులకు సూచించారు.
దర్యాప్తు సందర్భంగా సాంకేతిక లేదా న్యాయపరమైన సందేహాలు తలెత్తినప్పుడు ఇన్వెస్టిగేషన్ సపోర్ట్ సెంటర్ సేవలను వినియోగించుకోవాలని అధికారులకు సూచించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారులతో మర్యాదపూర్వకంగా మాట్లాడాలని, వారి సమస్యలను శ్రద్ధగా విని, తగిన పరిష్కారం అందిస్తామనే నమ్మకం కల్పించాలని, ప్రజలలో పోలీస్ శాఖపై నమ్మకం పెరగాలంటే స్పందనలో మానవీయ దృక్పథం, పనిలో వేగం, దర్యాప్తులో నిబద్ధత ఉండాలని అన్నారు.
శాంతిభద్రతల పరిరక్షణలో గ్రామ స్థాయిలో సమాచార సేకరణ అత్యంత కీలకమని, ప్రతి గ్రామానికి విలేజ్ పోలీసు అధికారిని నియమించాలని ఎస్హెచ్వోలకు ఆదేశించారు. ఆయా గ్రామాల్లో రౌడీషీటర్లు, కేడీలు, అనుమానితుల కదలికలపై నిరంతర నిఘా ఉంచడంతో పాటు ముందస్తు సమాచార సేకరణపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించారు. మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నివారణ, ఆర్థిక నేరాలు, ఆన్లైన్ మోసాలపై గ్రామాలు, పట్టణాల్లో విస్తృత అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశించారు.
ఈ సమీక్షా సమావేశంలో అదనపు ఎస్పీ చైతన్య రెడ్డి, డీఎస్పీలు సత్యయ్య గౌడ్, వెంకట్ రెడ్డి, సైదా నాయక్, ఇన్స్పెక్టర్లు రమేష్, సదా నాగరాజు, నాగేశ్వర్ రావు, ప్రవీణ్ రెడ్డి, జిల్లా ఇన్స్పెక్టర్లు, ఆర్ఐలు, సబ్ఇన్స్పెక్టర్లు తదితరులు పాల్గొన్నారు.












