సంగారెడ్డి, జూలై 30
ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని సంగారెడ్డి జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎద్దుమైలారంలోని పీఎంసీ కేంద్రీయ విద్యాలయంలో అవగాహన కార్యక్రమం జరిగింది. మహిళా సంక్షేమ శాఖ జిల్లా అధికారి లలిత కుమారి మాట్లాడుతూ, మానవ అక్రమ రవాణా అత్యంత ప్రమాదకరమైన నేరమని, దీనివల్ల బాధితులు తీవ్రంగా నష్టపోతారని వివరించారు.
ప్రపంచ మానవ అక్రమ రవాణా వ్యతిరేక దినోత్సవాన్ని పురస్కరించుకొని గురువారం జిల్లా మహిళా, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఎద్దుమైలారంలోని పీఎంసీ కేంద్రీయ విద్యాలయం, ఆర్డినెన్స్ ఫ్యాక్టరీ ప్రాంగణంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, సిబ్బందికి ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మహిళా సంక్షేమ శాఖ జిల్లా అధికారి లలిత కుమారి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడుతూ, మానవ అక్రమ రవాణా అనేది సమాజానికి అత్యంత ప్రమాదకరమైన నేరమని పేర్కొన్నారు. చిన్నారులు, మహిళలు, ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన వ్యక్తులను ఉద్యోగాలు, ఉన్నత విద్య, వివాహం, విదేశీ ఉపాధి వంటి పేర్లతో మోసపూరితంగా ఆకర్షించి అక్రమ రవాణాకు గురి చేసే సంఘటనలు పెరుగుతున్నాయని తెలిపారు.
మానవ అక్రమ రవాణా వల్ల బాధితులు శారీరక, మానసిక, ఆర్థిక, సామాజికంగా తీవ్రమైన నష్టాలను ఎదుర్కోవాల్సి వస్తుందని వివరించారు. బాల కార్మికత్వం, బాల్య వివాహాలు, బలవంతపు శ్రమ, లైంగిక దోపిడీ, బిచ్చాటన, అవయవాల అక్రమ వ్యాపారం వంటి నేరాలు మానవ అక్రమ రవాణాతో ముడిపడి ఉంటాయని చెప్పారు.
అనుమానాస్పద పరిస్థితులు గమనించినప్పుడు వెంటనే సంబంధిత ప్రభుత్వ శాఖలకు, పోలీసు శాఖకు లేదా చైల్డ్ హెల్ప్లైన్కు సమాచారం అందించి బాధితులను రక్షించేందుకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని సూచించారు.
ఈ కార్యక్రమంలో బాలల రక్షణ అధికారి రత్నం, పాఠశాల ప్రిన్సిపాల్ భారతీ దేవి, డీసీపీయూ కోఆర్డినేటర్ కల్పన, సఖి చైల్డ్ లైన్ కోఆర్డినేటర్ యాదగిరి, జిల్లా సైన్స్ అధికారి పి.సిద్ధారెడ్డి, ఏహెచ్టీయూ ప్రతినిధులు మాణిక్ రెడ్డి, ఎండి అలీ, జిల్లా మహిళా సాధికారత కేంద్రం సిబ్బంది విశాల, నరసింహులు, ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు.












