కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ పరిధిలో పెండింగ్ కేసుల సత్వర పరిష్కారం, శాంతిభద్రతల పరిరక్షణపై పోలీస్ కమిషనర్ (సీపీ) గౌష్ ఆలం గురువారం అధికారులకు కీలక ఆదేశాలు జారీ చేశారు. నెలవారీ నేర సమీక్షా సమావేశంలో ఆయన పలు అంశాలపై దృష్టి సారించారు.
కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలో జరిగిన సమీక్షా సమావేశంలో, సీపీ గౌష్ ఆలం అధికారులు తమ పరిధిలోని పెండింగ్ కేసుల డైరీలను (CD Files) సమర్పించి, వాటి పురోగతిని వివరించారు. 2024 వరకు పెండింగ్‌లో ఉన్న పాత కేసులు, ఈ ఏడాది నమోదైన తీవ్రమైన నేరాల (Grave Crimes) స్థితిగతులను ఆయన సమీక్షించారు.
ఆస్తి సంబంధిత నేరాలు, మహిళలపై జరుగుతున్న అఘాయిత్యాలు, పోక్సో (POCSO) చట్టం కింద నమోదైన కేసుల్లో దర్యాప్తును వేగవంతం చేయాలని సీపీ ఆదేశించారు. అలాగే, వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల వద్ద రైతులకు ఇబ్బందులు కలగకుండా రెవెన్యూ అధికారులతో సమన్వయం చేసుకోవాలని సూచించారు.
నగరంలో 'విజిబుల్ పోలీసింగ్' స్పష్టంగా కనిపించాలని, రాత్రి పగలు తేడా లేకుండా పెట్రోలింగ్ మరింత సమర్థవంతంగా నిర్వహించాలని సీపీ నొక్కి చెప్పారు. డయల్ 100 ద్వారా వచ్చే ఫిర్యాదులకు తక్షణమే స్పందించాలని, రౌడీ షీటర్లు, సస్పెక్ట్ షీటర్లపై నిఘా ఉంచి, వారి ఇళ్లపై ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలని ఆదేశించారు.
హోటళ్లు, లాడ్జీలలో సరైన గుర్తింపు కార్డులు, ఫోన్ నంబర్లు సరిచూసుకున్న తర్వాతే గదులు అద్దెకు ఇవ్వాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఇటీవల జరిగిన నేపాలీ ముఠాల ఘటనల నేపథ్యంలో, కమిషనరేట్ పరిధిలో పనిచేస్తున్న నేపాలీల వివరాలను నమోదు చేయాలని, బ్యాంకులు, జ్యువలరీ షోరూమ్‌లలో సెక్యూరిటీ ఆడిట్ నిర్వహించాలని సూచించారు. డ్రంక్ అండ్ డ్రైవ్, నంబర్ ప్లేట్ లేని వాహనాలపై ప్రత్యేక డ్రైవ్‌లు నిర్వహించాలని, కమ్యూనిటీ కాంటాక్ట్ ప్రోగ్రాం ద్వారా ప్రజల్లో అవగాహన కల్పించాలని, సైబర్ నేరాలపై విస్తృతంగా అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. మహిళా పోలీస్ సిబ్బందికి 'బ్లూ కోల్ట్స్' విధులను కేటాయించాలని, రానున్న బక్రీద్ పండుగ సందర్భంగా అక్రమ రవాణా జరగకుండా, శాంతిభద్రతల సమస్యలు తలెత్తకుండా ముందస్తు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కమిషనరేట్ వ్యాప్తంగా సీసీ కెమెరాల ఏర్పాటు, వాటి నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. ఈ సమావేశంలో ట్రైనీ ఐపీఎస్, అదనపు డీసీపీ, ఏసీపీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.










