కామారెడ్డి పట్టణంలోని ముసిరిబాగ్ గల్లీలో రెండు రోజుల పసికందు మృతదేహం లభ్యమవడం స్థానికంగా కలకలం రేపింది. ఖననం చేసిన శిశువును కుక్కలు బయటకు లాగి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
శనివారం ఉదయం గల్లీలో పసికందు మృతదేహాన్ని గమనించిన స్థానికులు వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ప్రాథమిక విచారణలో, పెద్ద కోడప్పగల్ గ్రామానికి చెందిన గంగామణి అనే మహిళ శుక్రవారం మృత శిశువుకు జన్మనిచ్చినట్లు తెలిసింది. కుటుంబ సభ్యులు శిశువును ఖననం చేసినప్పటికీ, సరైన పద్ధతిలో ఖననం చేయకపోవడం వల్ల కుక్కలు మృతదేహాన్ని బయటకు తీసి ఉండవచ్చని పోలీసులు భావిస్తున్నారు.
ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, పూర్తి స్థాయిలో దర్యాప్తు చేపట్టారు. ఘటనకు గల కారణాలపై ఆరా తీస్తున్నారు.










