కామారెడ్డి జిల్లాలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో స్వాధీనం చేసుకుని, యజమానులు క్లెయిమ్ చేసుకోని 195 అబాండెడ్ వాహనాలను బహిరంగ వేలం వేయడానికి జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. ఈ మేరకు జిల్లా ఎస్పీ ఎం. రాజేష్ చంద్ర ప్రకటన విడుదల చేశారు.
డిస్ట్రిక్ట్ పోలీస్ యాక్ట్–1861 సెక్షన్ 26 ప్రకారం ఈ వేలం ప్రక్రియ చేపట్టనున్నట్లు ఎస్పీ తెలిపారు. స్వాధీనం చేసుకున్న వాహనాలకు ఆరు నెలల పాటు యజమానులు క్లెయిమ్ చేసుకునే అవకాశం కల్పించారు. ఈ నెల 26వ తేదీ నుంచి ప్రారంభమయ్యే ఈ గడువులోగా, సంబంధిత యజమానులు సరైన పత్రాలతో జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఎంటీఓ కార్యాలయాన్ని సంప్రదించి తమ వాహనాలను తీసుకోవాలని సూచించారు.
గడువు ముగిసిన తర్వాత ఎలాంటి క్లెయిమ్‌లు పరిగణనలోకి తీసుకోబడవని, అప్పటికి క్లెయిమ్ కాని వాహనాలను ప్రభుత్వ ఆస్తిగా భావించి వేలం వేస్తామని ఎస్పీ స్పష్టం చేశారు. ఈ ప్రక్రియ ద్వారా పోలీస్ స్టేషన్లలో పేరుకుపోయిన వాహనాల సమస్యకు పరిష్కారం లభించనుంది.
వాహనాల వేలానికి సంబంధించిన పూర్తి వివరాలు, ప్రక్రియ గురించి తెలుసుకోవడానికి రిజర్వ్ ఇన్స్పెక్టర్ (ఎంటీఓ) ఏ. నవీన్‌ను సంప్రదించవచ్చని అధికారులు తెలిపారు. ఈ ప్రకటనతో వాహన యజమానులకు తమ వాహనాలను తిరిగి పొందేందుకు చివరి అవకాశం లభించింది.


