నిజామాబాద్, 2026-07-31
గుప్తనిధి పేరుతో ఒక వ్యక్తిని నమ్మించి, డబ్బులు కాజేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండలంలో వెలుగుచూసింది. అప్పుగా తీసుకున్న డబ్బులకు బదులుగా బంగారం ఇస్తానని చెప్పి, బంగారం రంగు పూసిన రాళ్లను ఇచ్చి మోసం చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు.
గుప్తనిధి పేరుతో ఒక వ్యక్తిని నమ్మించి, డబ్బులు కాజేసిన ఘటన నిజామాబాద్ జిల్లాలోని డిచ్పల్లి మండలంలో వెలుగుచూసింది. డిచ్పల్లి ఎస్సై ఆరిఫ్ తెలిపిన వివరాల ప్రకారం, నిజామాబాద్ నగరంలోని హమాల్వాడకు చెందిన పిల్ల రమేష్‌కుమార్ ఇంట్లో శ్రీనివాస్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి గత 15 సంవత్సరాలుగా అద్దెకు నివసిస్తున్నాడు. ఈ క్రమంలో శ్రీనివాస్, రమేష్‌కుమార్ వద్ద రూ.1.30 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పు తిరిగి చెల్లించాలని పలుమార్లు కోరినా, వివిధ కారణాలు చెబుతూ వాయిదా వేస్తూ వచ్చాడు.
అప్పు చెల్లించే ఉద్దేశం లేకపోవడంతో శ్రీనివాస్ ఒక పథకం రచించాడు. తనకు గుప్తనిధిలో బంగారం లభించిందని, నగదు బదులుగా ఆ బంగారాన్ని ఇస్తానని రమేష్‌కుమార్‌ను నమ్మించాడు. ఈ విషయం బయటకు తెలియకూడదని, ఇంటి వద్ద కాకుండా వేరే ప్రదేశంలో కలుద్దామని చెప్పాడు. అలాగే బంగారం ఇస్తున్నందుకు అదనంగా రూ.32 వేల నగదు తీసుకురావాలని కోరాడు.
శ్రీనివాస్ మాటలను నమ్మిన రమేష్‌కుమార్, గురువారం డిచ్పల్లి మండలం ఘన్పూర్ గ్రామంలోని తన బంధువుల ఇంటికి చేరుకుని నిందితుడికి సమాచారం ఇచ్చాడు. అక్కడికి వచ్చిన శ్రీనివాస్, మరో వ్యక్తితో కలిసి ఒక కుండలో ఉన్న నాలుగు బంగారం రంగు పూసిన రాళ్లను బంగారమని నమ్మించి, అప్పు మొత్తంతో పాటు అదనంగా తీసుకొచ్చిన రూ.32 వేల నగదును తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయాడు.
వారు వెళ్లిన అనంతరం అనుమానం వచ్చిన రమేష్‌కుమార్ పరిశీలించగా, అవి బంగారం కాకుండా కేవలం బంగారం రంగు పూసిన రాళ్లేనని గుర్తించాడు. తాను మోసపోయినట్లు గ్రహించిన బాధితుడు డిచ్పల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై ఆరిఫ్ తెలిపారు.


