గుజరాత్‌లోని రాజ్‌కోట్ జిల్లాలో దారుణ హత్య జరిగింది. తమ చెల్లెలితో ప్రేమ వ్యవహారం నడిపాడన్న కక్షతో ముగ్గురు సోదరులు కలిసి ఓ యువకుడిని అత్యంత కిరాతకంగా కొట్టి చంపారు. ఈ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు.
పాత ప్రేమ వ్యవహారమే కారణం
సంఘటన వివరాల్లోకి వెళితే, మృతుడు దినేష్, నిందితుల సోదరి సోనాల్ మధ్య ఏడాది క్రితం ప్రేమ వ్యవహారం సాగింది. అప్పట్లో దినేష్ సోనాల్‌ను మొర్బీకి తీసుకెళ్లగా, రెండు నెలల తర్వాత ఆమె ఇంటికి తిరిగి వచ్చింది. అప్పటి నుంచి ఇరు కుటుంబాల మధ్య ఉద్రిక్తతలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలోనే దినేష్‌ను చంపేస్తామని నిందితులు బెదిరించినట్లు తెలుస్తోంది.
రెండు గంటల పాటు విచక్షణారహితంగా దాడి
ఏప్రిల్ 18న దినేష్ తన స్నేహితుడి పొలానికి వెళ్లినప్పుడు, సోనాల్ సోదరులైన రాజేష్, సుర్సింగ్, కేవల్ అక్కడికి చేరుకున్నారు. 'మా చెల్లి పరువు తీశావు' అంటూ దినేష్‌తో వాగ్వాదానికి దిగి, ఆపై దాడికి పాల్పడ్డారు. రాజేష్, కేవల్ బెల్టులతో, సుర్సింగ్ తాడుతో దినేష్‌ను సుమారు రెండు గంటల పాటు తీవ్రంగా కొట్టారు. ఈ దాడిలో తీవ్ర గాయాలైన దినేష్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు.
పరువు హత్యగా నిర్ధారించిన పోలీసులు
పోలీసులు కేసు నమోదు చేసుకుని, ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. పరువు కోసమే ఈ హత్య జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది.







