గ్యాస్ సిలిండర్ల సరఫరాలో జరుగుతున్న మోసాన్ని అప్రమత్తతతో బయటపెట్టిన తండ్రీకొడుకులను హైదరాబాద్ పోలీస్ కమిషనర్ శ్రీ వీసీ సజ్జనర్ అభినందించారు. వారి ధైర్యాన్ని కొనియాడుతూ, శనివారం బంజారాహిల్స్ లోని టీజీఐసీసీసీలో ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ప్రశంసా పత్రంతో పాటు నగదు పురస్కారాన్ని అందజేసి, పౌర చైతన్యానికి మారుపేరుగా నిలిచారని పోలీస్ కమిషనర్ ప్రశంసించారు. సమాజంలో జరుగుతున్న అక్రమాలపై ప్రతి పౌరుడు ఇలాగే చైతన్యంతో స్పందించినప్పుడే నేరరహిత సమాజం నిర్మించగలమని ఆయన పేర్కొన్నారు.
చూడిబజార్‌కు చెందిన వ్యాపారి అశోక్ తివారీ, ఆయన 16 ఏళ్ల కుమారుడు నమాన్ తివారి గ్యాస్ సిలిండర్ల బరువులో తేడాను గమనించి, విచారణ చేపట్టారు. నిబంధనల ప్రకారం ఉండాల్సిన బరువు కంటే రెండు కిలోలు తక్కువగా ఉన్నట్లు గుర్తించారు.
విచారణలో, సిద్ధార్థ ఎంటర్ప్రైజెస్ ఏజెన్సీ ఉద్యోగులు గ్యాస్‌ను అక్రమంగా చిన్న సిలిండర్లలోకి రీఫిల్లింగ్ చేస్తున్నట్లు తేలింది. ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారంటూ గోషామహల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఐదుగురిని అరెస్ట్ చేసి, అక్రమంగా నిల్వ చేసిన సిలిండర్లు, రీఫిల్లింగ్ పరికరాలను స్వాధీనం చేసుకున్నారు.










