మేడ్చల్-మల్కాజిగిరి జిల్లా డిప్యూటీ కలెక్టర్ (RDO) కె. వంశీ మోహన్ అవినీతి వ్యవహారాలపై అవినీతి నిరోధక శాఖ (ACB) గురువారం (మే 21) భారీ సోదాలు నిర్వహించింది. ఆదాయానికి మించిన ఆస్తుల కేసు నమోదు చేసిన ఏసీబీ అధికారులు, వంశీ మోహన్‌తో పాటు ఆయన బంధువులు, సన్నిహితులకు చెందిన మొత్తం 8 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. ఈ సోదాల్లో వందల కోట్ల రూపాయల విలువైన అక్రమాస్తులు బయటపడినట్లు సమాచారం.
వంశీ మోహన్ తన అధికారిక హోదాను దుర్వినియోగం చేసి ప్రభుత్వ భూములను అక్రమంగా కాజేసినట్లు తీవ్ర ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల్లో, ఆయన సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమిని అక్రమంగా తన మామ పేరు మీద రిజిస్ట్రేషన్ చేయించి, ఆ తర్వాత దాన్ని ఓ ప్రముఖ రియల్టర్‌కు దారాదత్తం చేసినట్లు గుర్తించారు.
దీనికి ప్రతిఫలంగా, సదరు రియల్టర్ నుంచి వంశీ మోహన్ కుటుంబ సభ్యుల పేరిట 10 విలువైన ప్లాట్లను ‘గిఫ్ట్ డీడ్’ రూపంలో పొందినట్లు ఏసీబీ ఆధారాలు సేకరించింది. ఈ వ్యవహారంలో భారీగా లంచాలు చేతులు మారినట్లు అధికారులు అనుమానిస్తున్నారు.
హైదరాబాద్ మహానగరంతో పాటు పలు ప్రాంతాల్లో వంశీ మోహన్‌కు సంబంధించి వందల కోట్ల రూపాయల విలువైన స్థిరాస్తులు ఉన్నట్లు ఏసీబీ అధికారులు ప్రాథమికంగా అంచనా వేస్తున్నారు. సోదాల్లో భాగంగా భారీగా లభించిన ఆస్తి పత్రాలు, బ్యాంకు డిపాజిట్లు, బంగారం, నగదును ఏసీబీ స్వాధీనం చేసుకుంది. పూర్తి స్థాయి విచారణ అనంతరం ఆస్తుల విలువ మరింత పెరిగే అవకాశం ఉందని అధికారులు పేర్కొన్నారు.










