రంగారెడ్డి జిల్లాలో ఆర్.ఎం. కన్వర్టర్ ప్రైవేట్ లిమిటెడ్ పరిశ్రమలో అకౌంట్స్ విభాగంలో పనిచేస్తున్న హనుమాన్ లక్ష్మణ్ అనే వ్యక్తి కంపెనీకి చెందిన సుమారు రూ. 7.90 కోట్లకు పైగా డబ్బును మోసగించి తన సొంత ఖాతాలో జమ చేసుకున్నాడు. ఈ డబ్బును షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టి నష్టపోయినట్లు పోలీసుల విచారణలో తేలింది.
పరిశ్రమ డైరెక్టర్లకు అందిన ఫిర్యాదు మేరకు, రికార్డులను పరిశీలించగా మోసం జరిగినట్లు గుర్తించారు. వెంటనే పోలీసులకు ఫిర్యాదు చేశారు. డీసీపీ శిరీష, ఏసీపీ లక్ష్మీనారాయణ నేతృత్వంలో షాద్ నగర్ సీఐ నరసయ్య బృందం రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టింది. ఈ దర్యాప్తులో హనుమాన్ లక్ష్మణ్ కంపెనీ డబ్బును తన ఖాతాలోకి మళ్లించినట్లు నిర్ధారించారు.
పోలీసులు నిందితుడి ఖాతా నుంచి రూ. 1.47 కోట్ల నగదును స్వాధీనం చేసుకున్నారు. అలాగే, అతని వద్ద నుంచి వ్యక్తిగతంగా రూ. 2.60 లక్షల నగదు, రెండు స్మార్ట్ ఫోన్లను కూడా స్వాధీనం చేసుకున్నారు. మిగిలిన డబ్బును షేర్ మార్కెట్లో పెట్టుబడిగా పెట్టి నష్టపోయినట్లు నిందితుడు పోలీసులకు తెలిపాడు.
డిసిపి శిరీష తెలిపిన వివరాల ప్రకారం, నిందితుడు హనుమాన్ లక్ష్మణ్ గతంలో కూడా జూబ్లీహిల్స్, చందానగర్ ప్రాంతాలలో పనిచేసిన సంస్థలలో ఇలాంటి మోసాలకు పాల్పడినట్లు విచారణలో వెల్లడైంది. పలు డిగ్రీలు ఉన్నప్పటికీ, మోసాలకు పాల్పడటం పట్ల ఆమె ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అడ్డంగా దొరికిన నిందితుడిని అరెస్టు చేసి, రిమాండ్ కు తరలించినట్లు డిసిపి శిరీష తెలిపారు.










