కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో బలహీన సెక్షన్లు నమోదు చేశారని బీఆర్ఎస్ నాయకులు ఆరోపిస్తూ శేరిలింగంపల్లిలో నిరసన చేపట్టారు. మైనర్ బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ NH-65 జాతీయ రహదారిని దిగ్బంధించారు.
తెలంగాణ రాజకీయాల్లో తీవ్ర చర్చనీయాంశమైన బండి భగీరథ్ పోక్సో కేసు వ్యవహారంపై బీఆర్ఎస్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేసింది. కేసులో కావాలనే బలహీన సెక్షన్లు నమోదు చేశారని ఆరోపిస్తూ, బాధిత మైనర్ బాలికకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ శ్రేణులు చందానగర్ డివిజన్ అంబేద్కర్ విగ్రహం వద్ద భారీ నిరసన కార్యక్రమం చేపట్టాయి.
బీఆర్ఎస్ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని NH-65 జాతీయ రహదారిపై బైఠాయించి రోడ్డును దిగ్బంధించారు. దీంతో కొంతసేపు ట్రాఫిక్‌కు అంతరాయం ఏర్పడింది. "మైనర్ బాలికకు న్యాయం చేయాలి", "దోషులను వెంటనే అరెస్ట్ చేయాలి", "కాంగ్రెస్–బీజేపీ రాజకీయ నాటకాలు ఆపాలి" అంటూ నినాదాలు చేశారు. ఈ చర్యతో కేసును నీరుగార్చే ప్రయత్నం జరుగుతోందని వారు ఆరోపించారు.
ఈ సందర్భంగా బీఆర్ఎస్ నాయకులు మాట్లాడుతూ, పోక్సో చట్టంలోని సెక్షన్లు 7, 8 కింద కేసు నమోదు చేయాల్సి ఉండగా, ఉద్దేశపూర్వకంగానే సెక్షన్లు 11, 12 మాత్రమే చేర్చారని ఆరోపించారు. కేసును బలహీనపరిచి నిందితుడిని రక్షించేందుకు రాజకీయ ప్రభావం పనిచేస్తోందని విమర్శించారు. "చిన్నారిపై జరిగిన ఘటన అమానుషం. బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. దోషులపై కఠిన చర్యలు తీసుకోకుండా కాలయాపన చేయడం దురదృష్టకరం" అని బీఆర్ఎస్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు.
తెలంగాణలో మహిళల భద్రతపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని, రాజకీయ ప్రయోజనాల కోసం ప్రజా సమస్యలను పక్కన పెట్టొద్దని బీఆర్ఎస్ హెచ్చరించింది. కాంగ్రెస్ ప్రభుత్వం, బీజేపీ నాయకత్వం ఈ ఘటనపై స్పష్టమైన వైఖరి ప్రకటించాలని డిమాండ్ చేశారు. ప్రజల రక్షణ బాధ్యత వహించాల్సిన ప్రభుత్వాలు మౌనం వహిస్తే ప్రజలే రోడ్డెక్కాల్సిన పరిస్థితి వస్తుందని, బాధిత బాలికకు న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగుతుందని బీఆర్ఎస్ నాయకులు స్పష్టం చేశారు. ఈ ఆందోళనలో మాజీ కార్పొరేటర్ బొబ్బ నవత రెడ్డి, పలువురు నాయకులు పాల్గొన్నారు.








