సోషల్ మీడియాలో లైకులు, రీల్స్ కోసం బహిరంగ రహదారులపై ప్రమాదకరమైన బైక్ స్టంట్లు చేస్తూ, ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్న ఇద్దరు యువకులను ఖమ్మం టాస్క్ ఫోర్స్, కూసుమంచి పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ చర్యలపై పోలీసులు కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
ఖమ్మం నగరంతో పాటు పరిసర ప్రాంతాల్లోని జాతీయ రహదారులపై ప్రమాదకర విన్యాసాలు చేస్తూ, ఇతరుల ప్రాణాలకు ముప్పు తెస్తున్న ఇద్దరు యువకులను కూసుమంచి పోలీసులు గురువారం అదుపులోకి తీసుకున్నారు. వీరిలో ఒకరు కుసుమంచి మండలం, పరికసింగారం గ్రామానికి చెందిన మాదవరుపు శివ రామకృష్ణ (20) కాగా, మరొకరు కోక్య తండాకు చెందిన బానోత్ జశ్వంత్ (18).
టాస్క్ ఫోర్స్ ఏసీపీ సత్యనారాయణ తెలిపిన వివరాల ప్రకారం, ఈ యువకులు సోషల్ మీడియాలో గుర్తింపు కోసం బహిరంగ రహదారులపై ప్రాణాపాయం కలిగించే విధంగా బైక్ స్టంట్లు చేస్తూ, మితిమీరిన వేగంతో వాహనాలు నడుపుతున్నారు. దీనిపై పోలీస్ సోషల్ మీడియా బృందం నిశితంగా పరిశీలించి, చర్యలు చేపట్టింది.
ఈ తరహా చర్యలకు పాల్పడే వారిపై మోటారు వాహన చట్టం, పబ్లిక్ న్యూసెన్స్ కింద కఠిన సెక్షన్లతో కేసులు నమోదు చేస్తున్నామని ఏసీపీ స్పష్టం చేశారు. బహిరంగ రోడ్లపై బైక్ విన్యాసాలు చేయడం చట్టరీత్యా నేరమని, ఇది స్టంట్లు చేసేవారికే కాకుండా, రోడ్డుపై వెళ్లే పాదచారులకు, ఇతర వాహనదారులకు కూడా తీవ్ర ప్రమాదకరమని ఆయన పేర్కొన్నారు.
తల్లిదండ్రులకు కూడా సూచనలు జారీ చేస్తూ, మైనర్ పిల్లలకు బైక్లు ఇవ్వొద్దని, వారి కార్యకలాపాలను గమనిస్తూ, ప్రమాదకర పనులకు దూరంగా ఉండేలా కౌన్సిలింగ్ ఇవ్వాలని కోరారు. యువత ఇలాంటి సాహసాలకు పోయి ప్రాణాలను రిస్క్ లో పెట్టుకోవద్దని సూచించారు. ప్రజల భద్రతకు భంగం కలిగించే వారిపై సమాచారం అందిస్తే తక్షణ చర్యలు తీసుకుంటామని తెలిపారు.










