నిజామాబాద్, 2026-07-10
ముగ్పాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అనుమానాస్పద మృతిగా నమోదైన కేసు, దర్యాప్తులో హత్యగా నిర్ధారణ అయింది. ఈ కేసులో మృతుడి భార్య, కుమారుడు, కోడలు, కోడలి తమ్ముడిని పోలీసులు అరెస్టు చేసి, న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు. కుటుంబ కలహాలే ఈ హత్యకు దారితీసినట్లు పోలీసులు తెలిపారు.
ముగ్పాల్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అనుమానాస్పద మృతిగా నమోదైన కేసు, దర్యాప్తులో హత్యగా తేలింది. ఈ కేసులో మృతుడి భార్య, కుమారుడు, కోడలు, కోడలి తమ్ముడిని పోలీసులు అరెస్టు చేసి, న్యాయస్థానం ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించారు.
పోలీసుల వివరాల ప్రకారం, జూలై 8న ముగ్పాల్ పోలీస్‌స్టేషన్‌లో క్రైం నంబర్ 102/2026 కింద భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 103(1)తో పాటు 3(5) కింద కేసు నమోదు చేశారు. ఆమ్రాబాద్ గ్రామంలోని కొక్క్యా నాయక్ తండాకు చెందిన బానోతు హరి (50) అనుమానాస్పద పరిస్థితుల్లో మృతి చెందినట్లు ఆయన బంధువు బానోతు పవన్ ఫిర్యాదు చేయడంతో పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
విచారణలో బానోతు హరి తరచూ మద్యం సేవించి ఇంటికి వచ్చి భార్యతో పాటు కుటుంబ సభ్యులను వేధిస్తూ, శారీరకంగా హింసించేవాడని వెల్లడైంది. జూలై 7న పండుగ రోజున కూడా మద్యం మత్తులో ఇంటికి వచ్చి కుటుంబ సభ్యులతో గొడవకు దిగినట్లు పోలీసులు గుర్తించారు.
కుటుంబ కలహాలకు శాశ్వతంగా ముగింపు పలకాలనే ఉద్దేశంతో మృతుడి భార్య బానోతు మీరాబాయి, కుమారుడు బానోతు సురేష్, కోడలు రజిత, కోడలి తమ్ముడు వెంకటేష్‌లు కలిసి పథకం ప్రకారం అదే రోజు రాత్రి సుమారు 10.30 గంటలకు బానోతు హరిపై దాడి చేసి, గొంతు నొక్కి ఊపిరాడకుండా చేసి హత్య చేసినట్లు విచారణలో అంగీకరించినట్లు పోలీసులు తెలిపారు.
ఈ మేరకు నలుగురు నిందితులను అదుపులోకి తీసుకుని చట్టపరమైన చర్యలు చేపట్టారు. అనంతరం వారిని న్యాయస్థానం ఎదుట హాజరుపరచగా, కోర్టు ఆదేశాల మేరకు జ్యుడీషియల్ రిమాండ్‌కు తరలించినట్లు ముగ్పాల్ పోలీసులు వెల్లడించారు.












