బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో పోలీసులు దర్యాప్తును వేగవంతం చేశారు. బాధితురాలు మైనర్ కాదనే ఆరోపణలపై దృష్టి సారించిన పోలీసులు, ఆమెకు చెందిన రెండు వేర్వేరు జనన ధ్రువీకరణ పత్రాలపై లోతుగా విచారణ జరుపుతున్నారు.
హైదరాబాద్ సిటీ: బండి భగీరథ్‌పై నమోదైన పోక్సో కేసులో దర్యాప్తు వేగంగా కొనసాగుతోందని డీసీపీ రితిరాజ్ తెలిపారు. బాధితురాలు మైనర్ కాదనే ఆరోపణలపై పరిశీలన జరుగుతోందని ఆయన పేర్కొన్నారు. ఇప్పటివరకు సేకరించిన ఆధారాల ప్రకారం, బాధితురాలు సమర్పించిన రెండు పుట్టినరోజు ధ్రువపత్రాలపై దర్యాప్తు చేశామని, ఒకదానిలో నిర్మల్‌లో, మరొకదానిలో హైదరాబాద్‌లోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో జన్మించినట్లుగా ఉందని ఆయన వివరించారు.
ఒక సర్టిఫికెట్ ప్రకారం, బాధితురాలి వయసు 17 ఏళ్ల 9 నెలలు కాగా, మరో సర్టిఫికెట్ ప్రకారం 15 ఏళ్ల 7 నెలలు. రెండు ధ్రువీకరణ పత్రాల ప్రకారం చూసినా, బాధితురాలు మైనర్‌గానే ఉన్నారని డీసీపీ వెల్లడించారు. అయితే, ఒకే వ్యక్తికి రెండు వేర్వేరు జిల్లాల నుంచి రెండు బర్త్ సర్టిఫికెట్స్ ఎలా తీసుకున్నారు? ఎందుకు తీసుకున్నారు? అనే దానిపై విచారణ కొనసాగుతోందని ఆయన తెలిపారు.
ఇదిలా ఉండగా, విచారణకు హాజరుకావాలని పోలీసులు నోటీసులు ఇచ్చినప్పటికీ, బండి భగీరథ్ శుక్రవారం కూడా పోలీసుల విచారణకు హాజరుకాలేదు. పోలీసులకు ఈ-మెయిల్ ద్వారా సమాచారం అందించిన ఆయన, త్వరలో విచారణకు హాజరవుతానని తెలిపారు. అయితే, ఆయన రాకపోవడంతో, పోలీసులు ఐదు బృందాలను రంగంలోకి దించి, వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. టెలికం సంస్థలను, సర్వీస్ ప్రొవైడర్లను సంప్రదించి, సాంకేతిక ఆధారాలతో పట్టుకునేందుకు ప్రయత్నిస్తున్నట్లు పోలీసులు తెలిపారు.










