నిజామాబాద్, 2026-07-11
ప్రేమ, శాంతి, సోదర భావం అనేవి మానవత్వానికి పునాది అని, వీటిని దైనందిన జీవితంలో అలవర్చుకోవాలని సద్భావన ఫోరం నిజామాబాద్ ఆధ్వర్యంలో జరిగిన సమావేశంలో ముఖ్య అతిథి కృపాల్ సింగ్ సోడి అన్నారు. విద్య, ఆరోగ్యం, సమాన అవకాశాలు అందరికీ అందేలా చూడాలని, తద్వారా సమానత్వం, స్వేచ్ఛ, శాంతి లభించే నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని ఆయన తెలిపారు.
శాంతి వర్ధిల్లాలి, మానవత్వం పరిమళించాలి. ప్రేమ సమాజానికి పునాది అయితే, శాంతి ప్రగతికి సోపానం. సోదర భావం మన బలం. మానవత్వానికి మించిన మతం లేదు, ప్రేమకు మించిన భాష లేదు. మనల్ని మనుషులుగా నిలబెట్టే గొప్ప విలువలు ప్రేమ, శాంతి, సోదర భావం.
"ప్రేమతో ఆలోచించాలి, శాంతిని ఆచరించాలి, సోదర భావంతో నడవాలి. ఇదే మన భవిష్యత్తుకు మార్గదర్శకం" అని సద్భావన ఫోరం నిజామాబాద్ తరపున లిమ్రా గార్డెన్ నందు ఏర్పాటు చేసిన సమావేశంలో ముఖ్య అతిథిగా హాజరైన పి.ఆర్.టి.యు. తెలంగాణ జిల్లా గౌరవ అధ్యక్షులు, ధార్మిక్ మంచ్ జిల్లా కో-కన్వీనర్ కృపాల్ సింగ్ సోడి అన్నారు.
ప్రేమ, శాంతి, సోదర భావాలను దైనందిన జీవితంలో అలవర్చుకోవాలని, విద్య, ఆరోగ్యం, సమాన అవకాశాలు ప్రతి ఒక్కరికీ అందేలా చూడాలని ఆయన సూచించారు. ఈ దిశగా ప్రతి ఒక్కరూ ఒక్క అడుగు ముందుకు వేస్తే అందరికీ సమానత్వం, స్వేచ్ఛ, శాంతి లభించే నవ సమాజ నిర్మాణం సాధ్యమవుతుందని తెలిపారు. ఆపదలో ఉన్న వారికి, పేదలకు ఎలాంటి ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయడం, చిన్న పిల్లలు, వృద్ధుల పట్ల ఆప్యాయత చూపడం, హింసకు దూరంగా ఉండటం, వివాదాలను పరిష్కరించడం వంటివి మానవత్వానికి నిదర్శనమని అన్నారు.
మదర్ థెరీసా అనాథ సేవలో తమ జీవితాన్ని అంకితం చేసి మానవత్వమే అసలైన సోదర భావమని నిరూపించారని, ప్రేమ, శాంతితోనే ప్రపంచాన్ని జయించవచ్చని మహాత్మా గాంధీ నిరూపించారని కొనియాడారు. కరోనాకాలంలో కులమత ప్రాంతీయ భేదాలు లేకుండా ఒకరినొకరు సహాయం చేసుకోవడం నిజమైన సోదర భావానికి ఉదాహరణ అని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో షేక్ హుస్సేన్, బంగారం సాయిలు, జమాతే ఇస్లామిక్ హింద్ మాజిద్, డాక్టర్ సృజిల్ బాబు, రామ్ చందర్ గైక్వాడ్, లతీఫ్, నారాయణరెడ్డి, ప్రభుదాస్, రంజిత్ తదితరులు పాల్గొన్నారు.












