తప్పుడు జనాభా లెక్కల వల్ల తమకు అన్యాయం జరుగుతోందని, నాయకపోడు తెగకు ప్రత్యేక సీరియల్ నంబర్ కేటాయించాలని కోరుతూ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్‌కు నాయకపోడు కులస్థులు వినతి పత్రం సమర్పించారు.
భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో నాయకపోడు కులస్థులు తమ తెగకు ప్రత్యేక గుర్తింపు కల్పించాలని కోరుతూ జిల్లా కలెక్టర్ అంకిత్‌కు వినతి పత్రం సమర్పించారు. ప్రభుత్వ జనాభా లెక్కల్లో తమ తెగ జనాభాను తక్కువగా చూపడం వల్ల ఉద్యోగ, ఉపాధి, అభివృద్ధి అవకాశాలు కోల్పోతున్నామని వారు ఆవేదన వ్యక్తం చేశారు.
కుల పెద్ద తంబళ్ల రవి మాట్లాడుతూ, ఇటీవల ప్రభుత్వం ప్రకటించిన జనాభా వివరాలలో నాయకపోడు తెగ జనాభాను వాస్తవానికి విరుద్ధంగా కేవలం 16,000గా చూపారని తెలిపారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోనే తమ జనాభా 70,000 పైచిలుకు ఉందని, రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 6 లక్షల మంది ఉన్నామని ఆయన పేర్కొన్నారు.
1949లో షెడ్యూల్డ్ తెగల జాబితాలో స్వతంత్రంగా ఉన్న తమ తెగను, 1950లో గోండు తెగకు ఉప తెగగా మార్చడం వల్ల తమ ప్రత్యేక సంస్కృతి, ఉనికి దెబ్బతింటున్నాయని, దీనివల్ల ప్రభుత్వ పథకాలు తమకు సరిగ్గా అందడం లేదని ఆయన వివరించారు. ప్రస్తుత సర్వేలోని తప్పులను సవరించి, తమ వాస్తవ జనాభాను ప్రకటించాలని, రాబోయే జనగణనలో ప్రత్యేక కాలమ్ కేటాయించాలని డిమాండ్ చేశారు.
తమ అస్తిత్వాన్ని కాపాడేందుకు షెడ్యూల్డ్ తెగల జాబితాలో తమ తెగకు తిరిగి ప్రత్యేక సీరియల్ నంబర్ కేటాయించాలని వారు కోరారు. ఈ విషయమై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి, ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకపోడు కులస్థులు పాల్గొన్నారు.











