దేవునపల్లిలోని ఆనంద్ విహార్ కాలనీ సమీపంలో అనుమతి లేకుండా బొందల గడ్డ ఏర్పాటు చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని, దీనిపై కాలనీవాసులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ప్రభుత్వ స్మశానవాటిక ఉన్నప్పటికీ, నివాస ప్రాంతానికి సమీపంలో మరో శ్మశానాన్ని ఏర్పాటు చేయడంపై వారు అభ్యంతరం వ్యక్తం చేశారు.
పూర్తిగా నివాస ప్రాంతమైన ఆనంద్ విహార్ కాలనీలో చిన్నపిల్లలు, వృద్ధులు, మహిళలు నివసిస్తున్నారని, ఇలాంటి చోట బొందల గడ్డ ఏర్పాటు చేయడం వల్ల ప్రజల ఆరోగ్యం, పర్యావరణం, మానసిక స్థితిగతులపై ప్రతికూల ప్రభావం పడుతుందని కాలనీవాసులు ఆందోళన వ్యక్తం చేశారు.
గత ఫిబ్రవరి 24, 2025న కామారెడ్డి మున్సిపల్ కార్యాలయంలో జరిగిన ప్రజావాణి కార్యక్రమంలో ఈ విషయంపై ఫిర్యాదు చేసినట్లు కాలనీవాసులు తెలిపారు. అప్పుడు అధికారులు అది బొందల గడ్డ కాదని, ఆర్య క్షత్రియ సంఘానికి సంబంధించిన స్థలమని సమాధానం ఇచ్చారని పేర్కొన్నారు. అయితే, ఏప్రిల్ 3, 2025న ఎలాంటి అధికారిక అనుమతి లేకుండా అక్కడ ఒక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారని వారు ఆరోపించారు.
ఆర్యవైశ్య సంఘం నాయకుల వెనుక రాజకీయ పలుకుబడి ఉందని, దానితోనే ఈ కార్యక్రమాలు కొనసాగుతున్నాయని, దీనివల్ల కాలనీవాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని కాలనీవాసులు తెలిపారు. ఈ అక్రమ ఏర్పాటు వల్ల తమ జీవనం దుర్భరంగా మారిందని వారు వాపోయారు.
కావున, సంబంధిత అధికారులు వెంటనే స్పందించి, నివాస ప్రాంతానికి సమీపంలో బొందల గడ్డ ఏర్పాటును నిలిపివేయాలని, దీనిపై సమగ్ర విచారణ జరిపి, కాలనీ ప్రజలకు న్యాయం చేయాలని ఆనంద్ విహార్ కాలనీవాసులు విజ్ఞప్తి చేశారు.












