బాల్య వివాహాల నిర్మూలనకై అవగాహన కల్పించే లక్ష్యంతో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారిణి విద్యా చందన, జిల్లా సంక్షేమ అధికారిణి స్వర్ణలత లెనినా చేతుల మీదుగా గోడ పత్రిక ఆవిష్కరించబడింది.
యాక్షన్ ఫర్ ఇంటిగ్రేటెడ్ డెవలప్మెంట్ (ఎయిడ్) సంస్థ, జస్ట్ రైట్స్ ఫర్ చిల్డ్రన్ సహకారంతో బాల్య వివాహాల దుష్పరిణామాలపై ప్రజల్లో చైతన్యం తీసుకురావడానికి ఈ గోడ పత్రికను రూపొందించారు. ఏప్రిల్ 19న అక్షయ తృతీయ సందర్భంగా దీనిని విడుదల చేశారు.
బాల్య వివాహాలు సమాజానికి పెను శాపమని, దీనిని సమూలంగా నిర్మూలించాల్సిన ఆవశ్యకత ఉందని విద్యా చందన అన్నారు. బాలికల భవిష్యత్తును బంగారుమయం చేసేందుకు, బాల్య వివాహాలు లేని భద్రాద్రి కొత్తగూడెం జిల్లాను నిర్మించుకోవడానికి అందరూ కృషి చేయాలని ఆమె పిలుపునిచ్చారు.
చిన్న వయసులో వివాహాలు బాలికల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతాయని, మానసిక, శారీరక సమస్యలకు దారితీస్తాయని స్వర్ణలత లెనినా వివరించారు. గర్భధారణ, ప్రసవ సమయంలో సమస్యలు, పుట్టబోయే పిల్లల్లో లోపాలు, మాతా శిశు మరణాలు వంటివి సంభవించే ప్రమాదం ఉందని ఆమె హెచ్చరించారు.
జిల్లా యంత్రాంగం నిరంతరం గ్రామస్థాయిలో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తోందని, బాలల పరిరక్షణ చర్యలు చేపడుతోందని అధికారులు తెలిపారు. ఈ కార్యక్రమంలో పలువురు అధికారులు, సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు.











